న్యూఢిల్లీ: దేశంలో షాపింగ్స్ మాల్స్ వేగంగా విస్తరిస్తున్నాయి. 2020 నుంచి 8 ప్రధాన పట్టణాల్లో 16 కొత్త మాల్స్ తెరుచుకున్నాయి. కరోనా వంటి ఎన్నో ప్రతికూలతలు, సవాళ్లు ఉన్నా కానీ.. కొత్త మాల్స్ రూపంలో 15.5 మిలియన్ చదరపు అడుగులు వాణిజ్య స్థలం గత 30 నెలల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు నైట్‌ఫ్రాంక్ ‘థింక్ ఇండియా, థింక్ రిటైల్ 2022’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. 2019 డిసెంబర్ నాటికి దేశంలోని హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నైలో 255 మాల్స్, వీటి నుంచి స్థూల లీజు విస్తీర్ణం 77.4 మిలియన్ చదరపు అడుగులు అందుబాటులో ఉంది. 2022 జూన్ నాటికి భారత్‌లో మొత్తం 92.9 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం, 271 మాల్స్‌రూపంలో ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది.
గ్రేడ్ ఏ మాల్స్‌కు డిమాండ్..
దేశ రాజధాని ప్రాంతంలో అత్యధికంగా 34 శాతం షాపింగ్ మాల్ విస్తీర్ణం ఏర్పాటై ఉంది. ముంబై 18 శాతం, బెంగళూరు 17 శాతం వాటా కలిగి ఉన్నాయి. ‘‘రిటైల్ రియల్ ఎస్టేట్ రంగం కొత్త పరిపక్వత దశకు చేరుకుంది. చిన్న సైజు నుంచి గ్రేడ్ ఏ మాల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న గ్రేడ్ ఏ మాల్స్‌లో95 శాతం లీజు స్థలం నిండి ఉంది. నాణ్యమైన రియల్ ఎస్టేట్‌కు డిమాండ్‌ను ఇది తెలియజేస్తోంది. డెవలపర్ల నుంచి నాణ్యమైన ప్రాజెక్టుల అభివృద్ధి అవసరం’’అని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు.
రిటైల్ రియల్ ఎస్టేట్ రంగం.. పెట్టుబడులకు, రీట్‌లకు గొప్ప అవకాశం కల్పిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్‌లో 39 శాతం విస్తీర్ణం గ్రేడ్ ఏ పరిధిలో ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలిపింది. వీటి పరిధిలో స్థూల లీజు విస్తీర్ణం 36 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. టాప్–8 పట్టణాల్లో మొత్తం గ్రేడ్ ఏ మాల్స్ 52 ఉన్నాయి. గ్రేడ్ బీ కేటగిరీలో 94 మాల్స్ ఉండగా, 29.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం లీజుకు అందుబాటులో ఉంది. గ్రేడ్ సీ పరిధిలో 125 మాల్స్ 27.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment