
ముంబై : మార్కెట్‌లో కొనసాగుతున్న అనిశ్చితితో లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న ఇన్వెస్టర్లకు శుక్రవారం ఉదయం కొంత ఉపశమనం కలిగింది. తక్కువ ధరల వద్ద షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ఇన్వెస్టర్లకు లాభాలు పంచిన షేర్లు.. గురువారం ఒక్క సారిగా పతనం అయ్యాయి. నాలుగు రోజుల పాటు వచ్చిన లాభాల్లో సింహభాగం ఆవిరైపోయాయి. దీంతో శుక్రవారం మార్కెట్ ఎలా ప్రారంభం అవుతుందనే టెన్షన్ ఇన్వెస్టర్లలో నెలకొంది.
శుక్రవారం ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ లాభాలతో ప్రారంభం అయ్యింది. ఉదయం 9:10 గంటల సమయానికి 174 పాయింట్లు లాభపడి 59,776ల పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 17,797 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నవంబరు చివరి వారం నుంచి మార్కెట్‌లో బుల్, బేర్‌లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతుండటంతో ఇన్వెస్టర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.