న్యూఢిల్లీ: ఇళ్ల కొనుగోళ్ల విషయంలో ‘వడ్డీరేట్ల’ పెరుగుదల పెద్ద అడ్డంకిగా కనిపించడం లేదని రియల్టీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్యాంకులు వడ్డీరేట్లు పెంచినప్పటికీ, రూ.30–50 లక్షలు, రూ.50–75 లక్షల విభాగాల్లో ఇళ్ల రుణ డిమాండ్ పెరిగిందని ఇండియా మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీ (ఐఎంజీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది.
వడ్డీరేటు పెరుగుదల తీరిదీ..
కరోనా కాలంలో 4%గా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు), 2022 మే 4న తొలిసారి 0.40% పెరి గింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో 0.5% చొప్పున పెరుగుతూ, 5.9%కి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు 0.35% ఎగసి 6.25 శాతాన్ని తాకింది. వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5% రెపో రేటు పెరిగినట్లయ్యింది. ఈ పెంపుతో ఈ రేటు 6.5%కి చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత దీనికి నేపథ్యం. దీనికి అనుగుణంగా బ్యాంకులు కూడా గృహ రుణ రేట్లను పెంచుతూ వచ్చాయి. వినియోగదారులు నెలవారీ చెల్లింపుల (ఈఎంఐ) భారమూ పెరిగింది. ఈ పరిణామాలపై ఐఎంజీసీ తాజా నివేదికను ఆవిష్కరించింది.
నివేదికలో ముఖ్యాంశాలు..
► తక్కువ రుణ అర్హత, అలాగే ఆకర్షణీయమైన లీజింగ్ (అద్దె) ఎంపిక విధానాల ఆవిర్భావం కారణంగా మిలీనియల్స్ (1981–1996 మధ్య జన్మించినవారు) గృహ కొనుగోలు నిర్ణయాలను ఎక్కువగా వాయిదా వేస్తున్నారు.
► రెపో రేట్ పెంపుదల భారం రుణ గ్రహీతలకు బదలాయించడం జరుగుతోంది. దీనివల్ల వినియోగదారుల నెలవారీ చెల్లింపుల (ఈఎంఐ) భారం 10 నుంచి 25 శాతం శ్రేణిలో గణనీయంగా పెరిగింది. వడ్డీరేట్లు వార్షికంగా ప్రస్తుతం 9 నుంచి 9.25 శాతం పెరిగాయి.
► ఉద్యోగ కోతల నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో గత త్రైమాసికంలో మొండిబకాయిలు (ఎన్‌పీఏ) కొంత పెరిగాయి. సమస్య మరింత తీవ్రమైతే ఎన్‌పీఏలూ పెరగవచ్చు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నవారు రుణ కాల వ్యవధిని పెంచుకోడానికి బ్యాంకర్‌తో చర్చించవచ్చు. ఈఎంఐల చెల్లింపునకు తమ పొదుపులనూ వినియోగించుకోవచ్చు. రుణ చెల్లింపుల వైఫల్యం జరక్కుండా సాధ్యమైనంతగా ప్రయత్నించాలి.
ఐఎంజీసీ కీలకపాత్ర...
ప్రైవేటు రంగంలో 2014లో ఐఎంజీసీ కార్యకలాపాలు ప్రారంభించింది. 2008లో జారీ అయిన తనఖా గ్యారెంటీ మార్గదర్శకాల ప్రకారం దీనిని ఆర్‌బీఐ నియంత్రిస్తుంది. ఈ కంపెనీ టాప్ 5 ఒరిజినేటర్స్‌సహా 17 బ్యాంకింగ్ భాగస్వాములతో పని చేస్తుంది. వీటిలో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలు ఉన్నాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ హౌసింగ్ వీటిలో ఉన్నాయి. ప్రత్యేకంగా గృహ రుణాలకు సంబంధించి క్రెడిట్ డిఫాల్ట్ బీమాను ఐఎంజీసీ అందిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఒక కస్టమర్ హోమ్ లోన్‌పై డిఫాల్ట్ అయినట్లయితే, ఐఎంజీసీ బ్యాంకుకు నష్టపరిహారం ఇస్తుంది. తద్వారా బ్యాంక్‌నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
భారం తగ్గింపునకు ప్రయత్నం అవసరం
రుణ రేట్లు పెరిగిన ప్రస్తుత తరుణంలో రుణ గ్రహీతముందు ఇప్పుడు రెండు ఎంపికలు ఉన్నాయి. ఇందులో మొదటిది... క్రెడిట్ ప్రొఫైల్, రీపేమెంట్ చరిత్ర ప్రాతిపదికన సాధ్యమైన తక్కువకు వడ్డీని అమలుచేయించుకునేలా తమ రుణదాతతో చర్చించాలి. మీ బ్యాంకర్ అభ్యర్థనను పట్టించుకోకపోతే, తక్కువ, పోటీపూర్వక వడ్డీరేటును పొందేందుకు ఇతర బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక రెండవ ఎంపిక విషయానికి వస్తే.. కస్టమర్లు తమ వార్షిక బోనస్‌లు, పొదుపుల నుంచి పాక్షిక ప్రీ–పేమెంట్లు చేయడం వల్ల అధిక రుణ భారం నుంచి ఊరట పొందవచ్చు. గృహ రుణాల ప్రీ–పేమెంట్‌లకుగాను తక్కువ వడ్డీరేట్లలో వేసిన స్థిర డిపాజిట్లను కూడా ఉపసంహరించుకోవచ్చు. వినియోగదారులు తమ కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకోవడం తగదు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా రాబోయే త్రైమాసికాల్లో మరింత రేట్లు పెరిగే అవకాశం ఉన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. రుణ తిరిగి చెల్లించే సామర్థ్యం పరంగా భద్రతను పెంపొందించుకోడానికి తగిన మార్జిన్లను చేతిలో ఉంచుకోవాలి.
– అమిత్ దివాన్, ఐఎంజీసీ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్
వడ్డీ రేట్లు పెరిగినా.. ఇంటి కొనుగోలులో తగ్గేదేలే!
Published Sat, Feb 18 2023 4:11 AM | Last Updated on Sat, Feb 18 2023 4:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment