న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వచ్చే అయిదేళ్లలో దాదాపు రూ. 94,000 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించనుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయంగా వ్యాపార అవకాశాలు కల్పించవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. కోలియర్స్ ఇండియా, ఇండోస్పేస్ సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇన్ ఫుల్ గేర్‘ నివేదిక ప్రకారం దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పరిశ్రమ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉంది. అయితే, ప్రభుత్వ ఇస్తున్న ప్రోత్సాహకాలు, వాతావరణ మార్పులపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2070 నాటికి కర్బన ఉద్గారాలను నికరంగా సున్నా స్థాయికి తేవాలని భారత్ నిర్దేశించుకుంది. దేశీయంగా కర్బన ఉద్గారాలను వెలువరించే రంగాల్లో రవాణా రంగం మూడో స్థానంలో ఉంది. దీని వల్ల వాతావరణానికి జరుగుతున్న హానిని అంతా గుర్తిస్తున్న క్రమంలో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగగలదని నివేదిక వివరించింది.
వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం స్థలం అవసరమవుతుందని, తద్వారా రియల్ ఎస్టేట్‌కు కూడా డిమాండ్ పెరుగుతుందని నివేదిక తెలిపింది. 2030 నాటికి 110 గిగావాట్‌అవర్ (జీడబ్ల్యూహెచ్) బ్యాటరీల తయారీ సామర్థ్యాన్ని సాధించడానికి 1300 ఎకరాల పైగా స్థలం అవసరమవుతుందని పేర్కొంది. 2025 నాటికి భారత్‌లో 26,800 పబ్లిక్ చార్జింగ్ స్పాట్లు అవసరమవుతాయని వివరించింది. వీటి కోసం 13.5 మిలియన్ చ.అ. స్థలం కావాలని తెలిపింది. ‘స్థల యజమానులు రద్దీ ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లను చార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లకు అవుట్‌సోర్స్ చేయొచ్చు. అలాగే చార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లతో ఆదాయంలో వాటాల ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు‘ అని నివేదిక తెలిపింది. ప్రస్తుతం 15 రాష్ట్రాలు ఇప్పటికే ఈవీ విధానాలను ఆమోదించడమో లేదా నోటిఫికేషన్ ఇవ్వడమో చేశాయి. ఈవీల తయారీ, నిల్వ, చార్జింగ్ స్టేషన్లు, డీలర్‌షిప్‌లు వంటి అంశాల్లో అవకాశాలను రియల్ ఎస్టేట్ సంస్థలు అందిపుచ్చుకోవాలని కోలియర్స్ ఇండియా సీఈవో రమేష్ నాయర్ తెలిపారు. ఇప్పటికే చాలా మంది డెవలపర్లు తమ ప్రాజెక్టుల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment