వైద్య ఆరోగ్య సంబంధమైన ఉత్పత్తుల ప్రకటనల్లో హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు, డాక్టర్లుగా నటించే సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయన్సర్‌లు, వర్చువల్ ఇన్‌ఫ్లుయన్సర్‌లు వీక్షకులను తప్పుదారి పట్టించకుండా డిస్ల్కైమర్లు వేయడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఒకవేళ ప్రకటనల్లో అసలైన వైద్య నిపుణులు, హెల్త్, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌లు నటించినా కూడా వైద్య, ఆరోగ్య సంబంధ సమాచారాన్ని తెలియజేసేటప్పుడు, ఆయా ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేస్తున్నప్పుడు తాము ధ్రువీకరణ పొందిన హెల్త్/ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌లు లేదా వైద్య నిపుణులమనే విషయాన్ని బహిర్గతం చేయాలని సూచించింది.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్ శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) సహా వాటాదారులతో చర్చించిన అనంతరం ఈ మార్గదర్శకాలను రూపొందించింది.
సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయన్సర్‌లు, వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు.. ఆరోగ్య నిపుణులుగా లేదా వైద్య నిపుణులుగా నటిస్తూ వైద్య, ఆరోగ్య సమాచారాన్ని తెలియజేస్తున్నప్పుడు, వైద్య ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేసేటప్పుడు తాము చెప్పే విషయాలు వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టమైన డిస్ల్కైమర్లు వేయడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
వీటికి మినహాయింపు
అయితే వ్యక్తుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నిర్దిష్ట ఉత్పత్తులు, సేవలతో సంబంధం లేని సాధారణ వెల్‌నెస్, ఆరోగ్య సలహాలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే నీరు ఎక్కువగా తాగండి.. వ్యాయామం చేయండి.. బాగా నిద్రపోండి.. వంటి సాధారణ సలహాలు ఇవ్వవచ్చు. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ మార్గదర్శకాల అమలును చురుకుగా పర్యవేక్షిస్తుంది. ఉల్లంఘనలకు పాల్పడితే వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం జరిమానాలు విధించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment