దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 2022 డిసెంబర్ నెలలో 1.29 కోట్లుగా ఉంది. 2021 డిసెంబర్‌తో పోల్చినప్పుడు 15 శాతం పెరిగింది. కానీ 2019 డిసెంబర్ గణాంకాల కంటే ఒక శాతం తక్కువ. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఏవియేషన్‌పై ఓ నివేదిక విడుదల చేసింది. దేశీ ఏవియేషన్ పరిశ్రమ పట్ల ప్రతికూల అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్టు ఇక్రా తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల రద్దీ 9.86 కోట్లుగా (986 లక్షలు) ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 63 శాతం అధికం కాగా, 2019లో ఇదే కాలంతో పోల్చినా 9 శాతం వృద్ధి కనిపిస్తోంది.
గత నెలలో ఎయిర్‌లైన్స్ సంస్థలు దేశీ మార్గాల్లో అధిక సర్వీసులను నడిపించగా, కరోనా ముందు నాటితో పోలిస్తే ఇప్పటికీ 7 శాతం తక్కువగానే ఉన్నాయి. 2022 డిసెంబర్‌లో ప్యాసింజర్ లోడ్ (ప్రయాణికుల భర్తీ రేటు) 91 శాతంగా ఉంటే, 2021 ఇదే నెలలో 80 శాతం, 2019 డిసెంబర్‌లో 88 శాతం చొప్పున ఉంది.
కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకున్నందున 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీ ప్రయాణికుల రద్దీలో వేగవంతమైన పునరుద్ధరణను చూస్తున్నట్టు ఇక్రా తెలిపింది. అయితే ఏటీఎఫ్ ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలు క్షీణించినందున ఎయిర్‌లైన్స్ సంస్థల ఆదాయాల రికవరీ నిదానించొచ్చని పేర్కొంది. పెరిగిపోయిన వ్యయాల ఫలితంగా రూ.15,000–17,000 కోట్ల నష్టాలు నమోదు చేయవచ్చని ఇక్రా అంచనా వేసింది. 2021–22లో నికర నష్టాలు రూ.23,500 కోట్ల కంటే తక్కువేనన్న విషయాన్ని గుర్తు చేసింది.
రుణాల ఒత్తిళ్లు
సమీప కాలంలో భారత ఎయిర్‌లైన్స్ సంస్థలపై రుణ ఒత్తిళ్లు కొనసాగుతాయని ఇక్రా తెలిపింది. నిర్వహణ పనితీరును మెరుగుపరుచుకోవడం లేదా ఈక్విటీ రూపంలో నిధులు తీసుకురావడం వంటి చర్యలు చేపట్టనంత వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని పేర్కొంది. ఏటీఎఫ్ ధరలు అదే పనిగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగొచ్చని అంచనా వేసింది. ఎయిర్‌లైన్స్ సంస్థల ఆదాయాలు పెరిగినా కానీ, ఏటీఎఫ్ ధరల ప్రభావాన్ని అవి పూడ్చుకోలేవని పేర్కొంది. కనుక సమీప కాలంలో దేశీ ఎయిర్‌లైన్స్ ఆర్థిక పనితీరు ఒత్తిడితో కొనసాగుతుందని తెలిపింది. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం వల్ల లీజ్ అద్దెలు, నిర్వహణ వ్యయాల రూపంలో వాటి మొత్తం వ్యయాలపై గణనీయమైన భారం పడుతున్నట్టు పేర్కొంది. ఇంధన ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నందున.. ఈ తరుణంలో మార్కెట్ వాటాను పెంచుకోవాలన్న ఎయిర్‌లైన్స్ సంస్థల ఆకాంక్షలు వాటి మార్జిన్ల విస్తరణ అవకాశాలను పరిమితం చేస్తుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment