పరారీలో ఉన్న ఆర్ధిక నెరగాళ్లు విజయ్ మాల్య, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు చెందిన ఆస్తులలో 80 శాతం రూ.18,170 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. కేవలం ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా రూ.9,371.17 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు ఈడీ తెలిపింది. విజయ్ మాల్య, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ బ్యాంకులను మోసం చేసిన మొత్తం రూ.22,585.83 కోట్లు, వీటిలో రూ.18,170 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటి వరకు రూ.8,441 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు బదిలీ చేయగా, కోర్టు ఆదేశాల ప్రకారం జూన్ 25న మరో రూ.800 కోట్లు బదిలీ చేయాల్సి ఉంది.
ముంబైలోని పీఎంఎల్ఎ ప్రత్యేక కోర్టు ఆదేశాల ప్రకారం ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు ఈడీ తన వద్ద ఉన్న రూ.6,600 కోట్ల విలువైన షేర్లను బదిలీ చేసింది. వీటిలో రూ.5,824.50 కోట్లు విలువ చేసే షేర్లను కన్సార్టియం తరఫున ‘డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్‌టీ)’ విక్రయించినట్లు వెల్లడించింది. ఈ ముగ్గురు వ్యాపారవేత్తల దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలను పరిశీలించగా.. విదేశాల్లోనూ వీరు ఆస్తులు కూడబెట్టినట్లు తేలిందని వెల్లడించింది. అలాగే డొల్ల కంపెనీల పేరిట బ్యాంకుల నుంచి నిధులను సమీకరించినట్లు పేర్కొంది.
ఈ అంశాలపై మనీలాండరింగ్ చట్టం కింద విచారణ పూర్తయిన తర్వాత కేసులు నమోదు చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ తెలిపింది. ఈడీ తన దర్యాప్తులో రూ.18,170.02 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇందులో విదేశాలలో ఉన్న రూ.969 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. బ్యాంకులు నష్టపోయిన రూ.22,585.83 కోట్లలో దర్యాప్తు సంస్థ స్వాధీనంచేసుకున్న మొత్తం నష్టంలో 80.45%(రూ.18,170 కోట్లు). ఇదేగాక, ఈడీ సహాయంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే ఇంతకు ముందు వాటాలను విక్రయించడం ద్వారా రూ.1,357 కోట్ల నష్టాలను తిరిగి పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment