న్యూయార్క్: ఆధునిక సాంకేతికతో ఎలక్ట్రిక్ కార్లను రూపొందించే టెస్లా ఇంక్ షేరుకి ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్సులో చోటు దక్కనుంది. డిసెంబర్ 21 నుంచి టెస్లా షేరుకి చోటు కల్పిస్తున్నట్లు సోమవారం సాయంత్రం ఎస్‌అండ్‌పీ డోజోన్స్ ఇండెక్స్ పేర్కొంది. మార్కెట్లు ముగిశాక ఈ వార్త వెల్లడికావడంతో టెస్లా ఇంక్ షేరు ఫ్యూచర్స్‌లో ఏకంగా 14 శాతంపైగా దూసుకెళ్లింది. 408 డాలర్ల నుంచి 462 డాలర్లకు ఎగసింది. దీంతో కంపెనీలో 20 శాతం వాటా కలిగిన సీఈవో ఎలన్ మస్క్ సంపద 117.5 బిలియన్ డాలర్లను తాకింది. ఫలితంగా వ్యక్తిగత సంపద విషయంలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఎలన్ అధిగమించనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. వెరసి సాంకేతికంగా ప్రపంచ కుబేరుల్లో మూడో ర్యాంకుకు చేరినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది(2020) టెస్లా ఇంక్ షేరు 450 శాతం ర్యాలీ చేయడంతో ఇప్పటికే మస్క్ సంపదకు 90 బిలియన్ డాలర్లు జమ అయ్యింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 387 బిలియన్ డాలర్లను తాకింది. చదవండి: (ఇండియాకు మోడర్నా వ్యాక్సిన్)
ఇతర విశేషాలు
సోమవారం కోవిడ్-19 లక్షణాలు స్వల్పంగా కనిపిస్తున్నట్లు ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో మస్క్ ఏర్పాటు చేసిన రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్.. నలుగురు అంతరిక్ష యాత్రికుల(ఆస్ట్రోనాట్స్)ను స్పేస్ స్టేషన్‌లోకి పంపినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోపక్క ఇండెక్సులో టెస్లా ఇంక్‌కు చోటు కల్పిస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ-500 తాజాగా వెల్లడించింది. దీంతో మస్క్ వ్యక్తిగత సంపద భారీగా బలపడటం విశేషం! చదవండి: (వ్యాక్సిన్ ఆశలు- యూఎస్ కొత్త రికార్డ్స్)
ఇండెక్స్‌లో చేరితే..
భారీ మార్కెట్ విలువ కలిగిన టెస్లా ఇంక్ ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్సులో చేరడం ద్వారా యూఎస్ ఇండెక్స్ ఫండ్స్ పెట్టుబడి ప్రణాళికల్లో సవరణలు చోటుచేసుకోనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కంపెనీకున్న వెయిటేజీ రీత్యా 51 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇతర కౌంటర్ల నుంచి టెస్లా వైపునకు మళ్లే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎస్‌అండ్‌పీ ఇండెక్సులో చేరడం ద్వారా టెస్లా ఇంక్ అధికారికంగా బ్లూచిప్‌గా మారనున్నట్లు వ్యాఖ్యానించారు. ఏదైనా కంపెనీ ప్రామాణిక ఇండెక్సులో చోటు సాధించాలంటే.. కనీసం 8.2 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉండాలి. అధిక లిక్విడిటీతో ప్రజల వద్ద 50 శాతం వాటా(పబ్లిక్ ఫ్లోట్) ఉండాలి. అంతేకాకుండా గత నాలుగు త్రైమాసికాలుగా లాభాలు ఆర్జిస్తూ ఉండాలని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment