న్యూఢిల్లీ: ట్విటర్ డీల్ తరువాత టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థ టెస్లాలో వరుసగా బిలియన్ డాలర్ల షేర్లను విక్రయించడం కలకలం రేపుతోంది. ఇటీవలే ప్రపంచ నెంబర్ వన్ బిలియనీర్ హోదాను కోల్పోయిన మస్క్ మరోసారి 3.5 బిలియన్ల డాలర్ల విలువైన 22 మిలియన్ల టెస్లా షేర్లను విక్రయించారు.
యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ దాఖలు ప్రకారం డిసెంబర్ 12-15 నుండి మూడు రోజుల మధ్య స్టాక్‌లను అమ్మేశారు. అయితే ఈ విక్రయానికి గల కారణాలను మస్క్ వెల్లడించలేదు. నవంబర్ 2021 నుండి, మస్క్ సుమారు 40 బిలియన్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. దీంతో టెస్లాలో ఏడాది క్రితం 17 శాతంగా ఉన్న మస్క్ వాటా ఇపుడు 13.4 శాతానికి చేరింది.
ఖర్చులను తగ్గించుకునే పనిలో వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపిన మస్క్, ట్విటర్ ఆఫీసుల్లో చాలావరకు అద్దె చెల్లిపులను కూడా నిలిపి వేసిందట. అటు 44 బిలియన్ డాలర్లకుఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత నుంచి ప్రకటనదారులు ఒక్కొక్కరూ వైదొలగు తున్నారు. నవంబర్‌లో అంతకుముందు సంవత్సరం కంటే 85 శాతం పడిపోయాయని తెలుస్తోంది. ట్విటర్ ఆదాయంలో 89 శాతం ప్రకటనలదే. దీంతో మస్క్ సకక్షోభంలో పడిపోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు కొనుగోలులో భాగంగా ట్విటర్ సంవత్సరానికి సుమారు ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అప్పిచ్చిన బ్యాంకులు ఈ త్రైమాసికంలో నష్టాల బుకింగ్‌కు సిద్ధమవుతున్నాయి.
మస్క్ నవంబర్‌లో 3.4 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను, అంతకుముందు ఏప్రిల్‌లో 8.4బిలియన్ డాలర్లు, ఆగస్టులో 6.9 బిలియన్ డాలర్ల షేర్లను విక్రయించారు. మరోవైపు ట్విటర్ కొనుగోలు తరువాత టెస్లా షేర్లు 28 శాతం పతనాన్ని నమోదు చేశాయి. తాజాగా రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి. దీంతో టెస్లా కంటే ట్విటర్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారంటూ టెస్లా పెట్టుబడిదారులు మస్క్‌పైమండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment