ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ దిద్దుబాటు (కరెక్షన్) కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి, ప్రపంచ పరిణామాలు స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని చెబుతున్నారు. నవంబర్ వాహన విక్రయాలు, సెప్టెంబర్ త్రైమాసిక జీడీపీ గణాంకాలు, తయారీ, సేవారంగ డేటా, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు తదితర కీలకాంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉందని తెలిపారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ‘‘ప్రస్తుతం నిఫ్టీ 17,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 17,200 కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో కీలక వడ్డీరేట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణ, ఆర్థిక గణాంకాల నమోదును మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఆయా అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయి’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు కోవిడ్ కొత్త వేరియంట్ భయాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగడంతో గతవారంలో సూచీలు దాదాపు రెండుశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 2,529 పాయింట్లు, నిఫ్టీ 738 పాయింట్లను కోల్పోయాయి.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం
కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్(బి.1.1.529 వేరియంట్) ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను బెంబేలెత్తిస్తోంది. మన దేశంలో ఈ రకం కేసులు దేశంలో ఇప్పటివరకు నమోదుకాలేదు. అయితే అంతర్జాతీయంగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ చాలా శక్తివంతమైనదని, రెండు డోసుల టీకాలు వేసుకున్న వారికీ వ్యాధి సంక్రమించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వైరస్ వ్యాప్తి కట్టడికి అనేక దేశాలు సరిహద్దులను మూసేస్తున్నాయి. లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి. ఈ చర్యలతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే భయాలు ఈక్విటీ మార్కెట్లను వెంటాడుతున్నాయి.
కీలకంగా ఆర్థిక, ఆటో అమ్మక గణాంకాలు
సెప్టెంబర్ క్వార్టర్‌లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలు మంగళవారం విడుదల అవుతాయి. వార్షిక ప్రాతిపదికన రెండో త్రైమాసికంలో 8.4 శాతం నమోదు కావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. బేస్ ఎఫెక్ట్ కారణంగా గతేడాది ఇదే క్వార్టర్‌లో 20.1% వృద్ధి రేటు కనిపించింది. నవంబర్ మార్కిట్ మాన్యుఫ్యాక్చరింగ్ బుధవారం (డిసెంబర్ ఒకటిన) విడుదల అవుతుంది. అదేరోజున ఆటో కంపెనీలు నవంబర్ వాహన విక్రయాలను విడుదల చేయనున్నాయి. చిప్ కొరత సమస్యతో ప్యాసింజర్ వాహన అమ్మకాల వృద్ధిలో క్షీణత ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వారాంతపు రోజు శుక్రవారం దేశీయ సేవారంగ డేటా వెల్లడి అవుతుంది. ఈ కీలకమైన ఈ గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది.
తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు
భారత మార్కెట్ నుంచి విదేశీ పెట్టబడులు భారీగా తరలిపోవడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నవంబర్‌లో రూ.31,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. షేర్ల విలువలు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయనే కారణంతో అమ్మకాలకు పాల్పడుతున్నారు. ద్రవ్యోల్బణ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంచవచ్చనే అంచనాలతో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఎఫ్‌ఐఐల విక్ర యాలు కొనసాగితే మార్కెట్ మరింత పతనాన్ని చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.
ప్రపంచ పరిమాణాలు
ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. కోవిడ్ కేసులు పెరగడంతో ఆర్థిక వ్యవస్థ స్తంభించి డిమాండ్ క్షీణించవచ్చే అంచనాలతో ఇప్పటికే క్రూడాయిల్ ధర భారీ పతనాన్ని చవిచూసింది. క్రూడ్ ధరల అస్థిరత మన దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది ద్రవ్యోల్బణానికి దారితీయ వచ్చు.జపాన్ రిటైల్ అమ్మకాల డేటా నేడు(సోమవారం) అవుతుంది. అమెరికా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ టెస్ట్‌మోనీ(చట్టసభల్లో ఆర్థిక వ్యవస్థపై ప్రసంగం) మంగళవారం ఉంది. వీటితో పాటు చైనా, యూరప్ దేశాలు విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాల ఆధారంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కదలాడవచ్చు.
రేపు గో ఫ్యాషన్ షేర్ల లిస్టింగ్
గతవారంలో పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న గో ఫ్యాషన్ ఇండియా షేర్లు మంగళవారం(నవంబర్ 30న) లిస్ట్‌కానున్నాయి. ఒక్కో షేరు ధర శ్రేణి రూ.655 – 690 గా నిర్ణయించి కంపెనీ రూ.1,013 కోట్లను సమీకరణ సమీకరించింది. ఈ ఐపీఓకు 135 రెట్ల స్పందన లభించింది. కంపెనీ 80,79,491 షేర్లను ఆఫర్ చేయగా.. 109,44,34,026 షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. ఎల్లుండి లిస్ట్ కానున్న ఈ షేర్లు గ్రే మార్కెట్లో రూ.500(70%) ప్రీమియం ధర పలుకుతున్నాయి. గో ఫ్యాషన్ ఇండియా ‘గో కలర్స్’ పేరుతో సొంత స్టోర్లను దేశవ్యాప్తంగా పట్టణాల్లో నిర్వహిస్తోంది.
మార్కెట్లో దిద్దుబాటు కొనసాగవచ్చు
Published Mon, Nov 29 2021 8:18 AM | Last Updated on Mon, Nov 29 2021 8:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment