వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇంక్‌పై యూఎస్‌లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూఎస్ ప్రభుత్వంతోపాటు.. 48 రాష్ట్రాలు ఫేస్‌బుక్‌పై లాసూట్స్‌ను దాఖలు చేశాయి. మార్కెట్ శక్తిగా ఎదిగిన ఫేస్‌బుక్ పోటీని తప్పించుకునేందుకు పలు మార్గాలలో ప్రయత్రిస్తున్నట్లు ఆరోపిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. పోటీ సంస్థల విషయంలో కొనేయ్ లేదా భూస్థాపితం చెయ్ (బయ్ ఆర్ బ్యరీ) వ్యూహాలను ఫేస్‌బుక్ అనుసరిస్తున్నట్లు లాసూట్‌లో పేర్కొన్నాయి. తద్వారా చిన్న కంపెనీలను అణచివేస్తున్నట్లు ఆరోపించాయి. యాంటీట్రస్ట్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఫేస్‌బుక్‌పై బుధవారం ఫెడరల్ ట్రేడ్ కమిషన్ సైతం ఫిర్యాదు చేయడం గమనార్హం.
రెండో కంపెనీ
అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించిన గూగుల్ సైతం మార్కెట్లో ప్రత్యర్ధులను అణచివేస్తున్నట్లు ఇటీవల మాతృ సంస్థ అల్ఫాబెట్‌పైనా యూఎస్ న్యాయ శాఖలో ఫిర్యాదులు దాఖలైనట్లు టెక్నాలజీ రంగ నిపుణులు పేర్కొన్నారు. వెరసి యూఎస్ ప్రభుత్వం నుంచి న్యాయపరమైన ఫిర్యాదులను ఎదుర్కొంటున్న రెండో టెక్ దిగ్గజంగా పేస్‌బుక్ వార్తలలోనికి వచ్చినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. దశాబ్దకాలంగా ఫేస్‌బుక్ చిన్న ప్రత్యర్థి సంస్థలను అణచివేస్తున్నట్లు 46 రాష్ట్రాల తరఫున న్యూయార్క్ అటార్నీ జనరల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తద్వారా వినియోగదారులు నష్టపోతున్నప్పటికీ పోటీ నుంచి తప్పించుకుంటున్నట్లు తెలియజేశారు. కంపెనీకి పోటీగా ఎదిగేలోపు ప్రత్యర్ధులను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ఉదాహరణగా 2012లో ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ను 100 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడాన్ని ప్రస్తావించారు. ఇదేవిధంగా 2014లోనూ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను సైతం 19 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నట్లు వివరించారు. వెరసి ఫేస్‌బుక్‌ను మూడు కంపెనీలుగా విడదీయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నట్లు టెక్నాలజీ నిపుణులు పేర్కొన్నారు. (టెస్లా కార్లూ, షేర్లూ- మనకు భలే ఆసక్తి)
వినియోగదారులకు మేలే
ఫేస్‌బుక్ జనరల్ కౌన్సిల్ జెన్నిఫర్ న్యూస్టెడ్ కంపెనీపై వెల్లువెత్తిన ఫిర్యాదులను తోసిపుచ్చారు. విజయవంతమైన కంపెనీలను శిక్షించేందుకు యాంటీట్రస్ట్ నిబంధనలు అనుమతించవంటూ తెలియజేశారు. వినియోగదారులకు నష్టం వాటిల్లుతున్నట్లు ఫేస్‌బుక్‌పై చేసిన ఆరోపణలు సరికాదని జెన్నిఫర్ ఈ సందర్భంగా వాదిస్తున్నారు. వాట్సాప్‌ను ఉచితంగా అందించడం ద్వారా యూజర్లకు లబ్దిని చేకూరుస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. ఈ వార్తల నేపథ్యంలో బుధవారం ఫేస్‌బుక్ షేరు 2 శాతం క్షీణించి 278 డాలర్ల వద్ద ముగిసింది. (రికార్డ్స్‌కు బ్రేక్- మార్కెట్లు పతనం)
Comments
Please login to add a commentAdd a comment