
ప్రాజెక్టులకు ‘ఎల్‌వోసీ’ ఇవ్వకండి, ఆర్ధిక శాఖకు కేంద్రం కీలక ఆదేశాలు!
న్యూఢిల్లీ: ఆర్థికాంశాల నిర్వహణలో పారదర్శకతను మెరుగుపర్చుకునే దిశగా కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ తరఫున ప్రాజెక్టులను చేపట్టేందుకు ఎంపిక చేసిన సంస్థలకు ’లెటర్ ఆఫ్ కంఫర్ట్’లు (ఎల్‌వోసీ) జారీ చేయొద్దంటూ ప్రభుత్వంలోని ఇతర శాఖలు, విభాగాలకు సూచించింది. ఇందుకు సంబంధించి ఆయా శాఖలకు ఇచ్చిన అధికారాలను తక్షణం ఉపసంహరిస్తూ మెమోరాండం జారీ చేసింది.
ప్రభుత్వ హామీతో, ప్రాజెక్టులకు అవసరమైన నిధులను వేగవంతంగా సమకూర్చుకునేందుకు కాంట్రాక్టరుకు ఎల్‌వోసీలు ఉపయోగపడతాయి. రైల్వే వంటి మౌలిక సదుపాయాల కల్పన శాఖలకు వీటిని జారీ చేసే అధికారాలు ఇచ్చారు.
అయితే, ఈ ఎల్‌వోసీలు దుర్వినియోగమవుతున్నాయన్న ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఆర్థిక క్రమశిక్షణ చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల వివరాలన్నింటినీ బడ్జెట్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది.