
న్యూఢిల్లీ: ఫుడ్ ప్రాసెసింగ్ (ఆహార ఉత్పత్తుల పరిశ్రమ) రంగాన్ని దేశంలో మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద రాయితీలను ప్రకటించింది. ఈ విభాగంలో దిగ్గజ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సహా మొత్తం 60 దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. జాబితాలో పార్లే, డాబర్, బ్రిటానియా, నెస్లే ఇండియా, హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), అమూల్ తదితర కంపెనీల దరఖాస్తులున్నాయి. రెడీ టు ఈట్ (తినడానికి సిద్ధంగా ఉన్నవి), రెడీ టు కుక్ (స్వల్ప సమయంలోనే ఉండుకుని తినేవి), పండ్లు, కూరగాయలు, మెరైన్, మొజరెల్లా చీజ్ విభాగాల కింద ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 91 దరఖాస్తులు రాగా, అందులో 60కి ఆమోదం తెలిపింది. ప్రస్తుత సామర్థ్యానికి అదనంగా చేసే ఉత్పత్తిపై ఈ కంపెనీలకు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. అనుమతులు సంపాదించిన ఇతర ముఖ్య కంపెనీల్లో అవంతి ఫ్రోజన్ ఫుడ్స్, వరుణ్ బెవరేజెస్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, పరాగ్ మిల్క్ ఫుడ్స్, ప్రతాప్ స్నాక్స్, టేస్టీ బైట్ ఈటబుల్స్, ఎంటీఆర్ ఫుడ్స్ ఉన్నాయి.
పెద్ద పరిశ్రమగా అవతరిస్తుంది
భారత్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం దీర్ఘకాలంలో పెద్ద పరిశ్రమగా అవతరించేందుకు పీఎల్‌ఐ పథకం సాయపడుతుందని ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ అభిప్రాయపడింది. ఉద్యోగ కల్పనలో తాము కీలక పాత్ర పోషిస్తామని దిగ్గజ కంపెనీలు ప్రకటించాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో పెద్ద పరిశ్రమగా అవతరిస్తుందని పార్లే ఆగ్రో ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్‌షా అన్నారు. మెరుగైన యంత్రాలు, ప్లాంట్ల ఏర్పాటుకు ఈ పథకం వీలు కల్పిస్తుందని.. అంతర్జాతీయంగా గొప్ప భారత బ్రాండ్లు అవతరిస్తాయన్నారు. అంతర్జాతీయంగా భారత కంపెనీలు పోటీపడగలవంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. డాబర్ ఇండియా సీఈవో మోహిత్ మల్హోత్రా కూడా ఇదే మాదిరి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉద్యోగ కల్పనతోపాటు దేశీయంగా భారీ ఉత్పాదకతకు పీఎల్‌ఐ పథకం సాయపడుతుందున్నారు. పీఎల్‌ఐ పథకం భారత్‌లో రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు చేదోడుగా నిలుస్తుందని.. పండ్లు, కూరగాయల విభాగంలో ప్రోత్సాహకాలకు ఎంపికైన నెస్లే ఇండియా పేర్కొంది.