Food Products And Fuel Costs Will Be Hike In India | అన్నీ ఖరీదే - Sakshi
Sakshi News home page

అన్నీ ఖరీదే: పెరుగుతున్న ముడివస్తువులు, ఇంధనాల రేట్లు

Published Sat, May 22 2021 8:46 AM | Last Updated on Sat, May 22 2021 3:17 PM

As Fuel And Raw Material Prices Rise Lead To Products More Costly - Sakshi

ఇంధనాల ధరలు భగభగ మండిపోతుండటం .. ఇతరత్రా ముడివస్తువులు, ఉత్పత్తుల రేట్లపైనా.. అంతిమంగా కొనుగోలుదారులపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇటు రవాణా వ్యయాలు భారీగా ఎగియడంతో పాటు అటు ముడి వస్తువుల రేట్లు ఆకాశాన్ని తాకుతుండటంతో కంపెనీలు క్రమంగా ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో బిస్కెట్లు మొదలుకుని ఏసీల దాకా అన్నింటా రేట్ల మోత మోగిపోతోంది.  

వాహన కంపెనీలు, రవాణా సంస్థల లెక్కల ప్రకారం గడిచిన రెండు నెలల వ్యవధిలో ట్రక్కుల అద్దెలు 10–12 శాతం దాకా ఎగిశాయి. దీంతో చాలా మటుకు కంపెనీలు ప్రస్తుతం సరుకు రవాణా చార్జీలపై చర్చలు జరుపుతున్నాయి. రవాణా చార్జీలు పెరిగిన నేపథ్యంలో ఎంజీ మోటర్‌ వంటి వాహనాల తయారీ సంస్థలు .. తమ ఉత్పత్తుల ధరలను కూడా పెంచే యోచనలో ఉన్నాయి. సాధారణంగా కారు ఖరీదులో రవాణా వ్యయాలు 2–2.5 శాతం మేర ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

అయితే, ట్రక్‌ అద్దెలు 12 శాతం దాకా పెరిగిపోవడంతో తమ కార్ల ధరలను మరో విడత 2–3 శాతం మేర పెంచాలని భావిస్తున్నట్లు వివరించాయి. మరోవైపు, సరకు రవాణా సంస్థల కష్టాలు మరో రకంగా ఉన్నాయి. సాధారణంగా ట్రక్కుల సరీ్వసులకు సంబంధించి 45 శాతం వ్యయాలు ఇంధనానిదే ఉంటోంది. కరోనా వైరస్‌ తెరపైకి వచ్చినప్పట్నుంచీ ఇంధనాల ధరలు 65 సార్లు మారడంతో రేట్లు 30 శాతం దాకా పెరిగాయని లాజిస్టిక్స్‌ సంస్థ రివిగో వ్యవస్థాపకుడు దీపక్‌ గర్గ్‌ తెలిపారు. వ్యయాలు తక్షణం 15–20 శాతం తగ్గకపోతే ట్రక్కింగ్‌ పరిశ్రమకు మరింత కష్టకాలం తప్పదని పేర్కొన్నారు. 

ధరలు, డిమాండ్‌పై ప్రభావం.. 
చాలా మటుకు ట్రాన్స్‌పోర్టర్లు ఎక్కువగా డీజిల్‌ను ఉపయోగిస్తుంటారు. 2020 జూలై నుంచి చూస్తే డీజిల్‌ ధరలు దాదాపు 11.3 శాతం పెరిగాయని గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ వర్గాలు తెలిపాయి. దీంతో సరుకు రవాణా చార్జీలు ఎగిశాయని వివరించాయి. ఫలితంగా ధరలు, వినియోగదారుల డిమాండ్‌పైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ వర్గాలు తెలిపాయి. ఇంధనాల రేట్లతో పాటు ఇతరత్రా ముడి వస్తువుల ధరలు పెరగడం కూడా కంపెనీలపై భారం మోపుతున్నాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల్లో భాగమైనందువల్ల ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ రేట్లు కూడా పెరుగుతున్నాయని .. దీనితో లాభాలు క్షీణిస్తున్నాయని వివరించాయి.

ఒకవేళ ధరలు తగ్గకపోతే ఆ భారాన్ని కొనుగోలుదారుపై మోపక తప్పదని బిస్కెట్లు తదితర ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ పార్లే వర్గాలు స్పష్టం చేశాయి. సాధారణంగా దిగువ మధ్యతరగతి కుటుంబాల విషయం తీసుకుంటే సరకు రవాణా వ్యయాల పెరుగుదల వల్ల కూరగాయలు సహా నిత్యావసర వస్తువుల ధరల భారం 1–2 శాతం మేర పెరగవచ్చని వేకూల్‌ ఫుడ్స్‌ సంస్థ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతానికి ఇది పెద్ద భారం కాకపోయినా ఇదే పరిస్థితి కొనసాగితే కుటుంబాల బడ్జెట్‌పై ప్రభావం తప్పకుండా పడుతుందని పేర్కొన్నాయి.

అటు ఎగిసే ఇంధన రేట్లతో విమానయానం కూడా మరింత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఇంధనాల (ఏటీఎఫ్‌) ఖర్చు 40 శాతం దాకా ఉంటుంది. గతేడాది జూన్‌ 1న ఢిల్లీలో రూ.26,860గా ఉన్న కిలోలీటరు ఏటీఎఫ్‌ రేటు ఈ ఏడాది జనవరి 1 నాటికి రూ. 40,783కి ఎగిసింది. ఫలితంగా ఢిల్లీ–ముంబై మధ్య ఎకానమీ తరగతి విమాన ప్రయాణ చార్జీల శ్రేణి రూ. 3,500–10,000 నుంచి రూ. 3,900–13,000కి పెరిగిందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. యూజర్‌ ఫీజులు మొదలైనవి కాకుండానే ఈ స్థాయిలో ఉంటోందని వివరించాయి. 

చర్చల్లో సంస్థలు..
పెరుగుతున్న ఇంధనాల ధరల భారాన్ని తగ్గించుకునేందుకు కంపెనీలు అన్ని అవకాశాలనూ అన్వేషిస్తున్నాయి. అమెజాన్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ–కామర్స్‌ దిగ్గజాలకు సర్వీసులు అందించే ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్‌ .. ఇప్పటికే పెరిగిన వ్యయాలను సర్దుబాటు చేసుకునేలా కాంట్రాక్టులను సవరించుకునే దిశగా క్లయింట్లతో చర్చలు జరుపుతోంది.

అటు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా తమ డెలివరీ పార్ట్‌నర్లకు కొత్త చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే రంగానికి చెందిన జొమాటో కూడా పెరిగిన ఇంధనాల వ్యయాల భారాన్ని కొంత తగ్గించే దిశగా డెలివరీ పార్ట్‌నర్లకు జరిపే చెల్లింపులను పెంచనున్నట్లు వెల్లడించింది. అయితే, అంతిమంగా ఈ భారాన్ని వినియోగదారులకు బదలాయిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశమని పరిశ్రమవర్గాలు తెలిపాయి.

చదవండి: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement