న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మార్చి నెలలో ఇంధన విక్రయాలు కోవిడ్ ముందస్తు స్థాయికి చేరాయి. మహమ్మారి సంబంధిత పరిమితుల ఎత్తివేతతో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ధరలు పెరిగే అవకాశం ఉందని విక్రేతలు, వినియోగదార్లు ముందస్తుగా నిల్వ చేయడమూ ఇందుకు కారణం. డీలర్లు తక్కువ ధరకు ఇంధనాన్ని కొనుగోలు చేసి, సవరించిన అధిక ధరలకు విక్రయించడం ద్వారా త్వరగా డబ్బు సంపాదించాలని ఆశించారు.
గడిచిన రెండేళ్లలో డీజిల్ విక్రయాలు అధికంగా నమోదైంది మార్చి నెలలోనే. అయిదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలు 137 రోజులు స్థిరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు కాగానే ధరలు పెరుగుతాయన్న అంచనాతో మార్చి మొదటి రెండు వారాల్లో డీలర్లు, ప్రజలు పెట్రోల్, డీజిల్‌ను విరివిగా కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో వినియోగం పెట్రోల్ 17.3, డీజిల్ 22.3 శాతం అధికమైంది. ధరల సవరణ మార్చి 22 నుంచి మొదలైంది. ధరలు పెరగడం మొదలు కావడంతో వినియోగం తగ్గుముఖం పట్టింది.
ఇవీ గణాంకాలు..
ప్రభుత్వ రంగ సంస్థలు మార్చి నెలలో 2.69 మిలియన్ టన్నుల పెట్రోల్‌ను విక్రయించాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.7 శాతం, 2019తో పోలిస్తే 14.2 శాతం అధికం. మొత్తం అమ్మకాల్లో ఈ సంస్థల వాటా ఏకంగా 90 శాతముంది. డీజిల్ విక్రయాలు 10.1 శాతం పెరిగి 7.05 మిలియన్ టన్నులుగా ఉంది. 2019 మార్చితో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. మార్చి 1–15 మధ్య అమ్మకాలు పెట్రోల్ 18 శాతం, డీజిల్ 23.7 శాతం దూసుకెళ్లాయి. 2020తో పోలిస్తే గత నెలలో జరిగిన విక్రయాలు పెట్రోల్ 38.6 శాతం, డీజిల్ 41.6 శాతం అధికం. ఇక విమానాల్లో వాడే ఇంధనం 9.8 శాతం దూసుకెళ్లి మార్చిలో 4,91,200 టన్నులకు చేరింది. కోవిడ్ ముందస్తు స్థాయితో పోలిస్తే 27.6 శాతం వెనుకబడి ఉంది. 2020 మార్చితో పోలిస్తే 7.5 శాతం ఎక్కువ కావడం విశేషం. ఎల్‌పీజీ అమ్మకాలు 12 శాతం అధికమై గత నెలలో 2.53 మిలియన్ టన్నులకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment