న్యూఢిల్లీ: కోవిడ్ అనంతరం లగ్జరీ ఉత్పత్తుల వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజాలు భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు రెండు డజన్ల సంస్థలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. దశాబ్దకాలంలో ఇది గరిష్ట స్థాయి కాగలదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2020లో ఒక అంతర్జాతీయ బ్రాండ్ రాగా, 2021లో మూడు, 2022లో 11 సంస్థలు వచ్చాయి. కోవిడ్ మహమ్మారికి ముందు ఏటా దాదాపు 12–15 బ్రాండ్స్ భారత్‌కు వచ్చేవి. కోవిడ్ తర్వాత లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్‌తో గత కొద్ది నెలల్లో వాలెంటినో, మెక్‌లారెన్, బాలెన్షియాగా తదితర బ్రాండ్స్ వచ్చాయి.
తాజాగా గ్లోబల్ బ్రాండ్స్‌ను తీసుకురావడంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్), రిలయన్స్ రిటైల్ తదితర సంస్థలు కీలకంగా ఉంటున్నాయి. దేశీయంగా లగ్జరీ డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌ను, ప్రత్యేకంగా ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంను ప్రారంభించే దిశగా ఫ్రెంచ్ దిగ్గజం గ్యాలెరీస్ లాఫేట్‌తో ఏబీఎఫ్‌ఆర్‌ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. అటు చైనీస్ దిగ్గజం షీన్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు రిలయన్స్ రిటైల్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఫుడ్.. ఎంటర్‌టైన్‌మెంట్ బ్రాండ్స్ ఆసక్తి..
ఈ ఏడాది దేశీ మార్కెట్లోకి ఎక్కువగా ఫుడ్ .. బేవరేజెస్, కొన్ని వినోద రంగ బ్రాండ్స్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ రాబర్టో కావలీ, బ్రిటిష్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ డన్‌హిల్, అమెరికాకు చెందిన స్పోర్ట్స్‌వేర్..ఫుట్‌వేర్ రిటైలర్ ఫుట్ లాకర్ మొదలైనవి కూడా భారత మార్కెట్లో కాలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి.
(ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి కొత్త ఎమ్‌పీవీ - వివరాలు)
వీటికి తోడు ఇటలీకి చెందిన లవాజా..అర్మానీ కెఫె, అమెరికన్ సంస్థ జాంబా, ఆస్ట్రేలియన్ బ్రాండ్ ది కాఫీ క్లబ్ కూడా ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నాయి. రిటైల్ కార్యకలాపాలకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే 5వ అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. పలు బ్రాండ్‌ల రాకతో రిటైల్ స్థలం లీజింగ్ 5.5 – 6 మిలియన్ చ.అ.ల మేర ఉండొచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీలు అంచనా వేస్తున్నాయి. 2019లో నమోదైన 6.8 మిలియన్ చ.అ. గరిష్ట స్థాయి తర్వాత ఇదే అత్యధికం.
Comments
Please login to add a commentAdd a comment