సాక్షి, హైదరాబాద్: ఫిలిప్పీన్స్ యాంటీ డమ్మీ చట్ట నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను జీఎంఆర్ ఎదుర్కొంటోంది. ఇందుకు సంబంధించి అందిన ఫిర్యాదుపై ఫిలిప్పైన్స్‌లోని మక్టాన్–సెబూ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (ఎంసీఐఏఏ), అలాగే విమానాశ్రయ ఆపరేటర్ జీఎంఆర్ మెగావైడ్ సెబూ ఎయిర్‌పోర్ట్ కార్ప్ (జీఎంసీఏసీ) అధికారులపై చట్టపరమైన చర్యలు ప్రారంభమైనట్లు ఆ దేశ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎన్‌బీఐ) తెలిపింది. ఈ ఫిర్యాదు విషయంలో న్యాయశాఖ అధికారుల ముందు తమ యాంటీ–ఫ్రాడ్ విభాగం ఆరోపణలు దాఖలు చేసినట్లు పేర్కొంది. వీరిలో ఐదుగురు ఫిలిప్పైన్స్‌కు చెందిన ఎంసీఐఏఏ ఉన్నత స్థాయి అధికారులు, జీఎంఆర్ గ్రూప్‌నకు చెందిన కొందరితోసహా పదకొండుమంది విదేశీయులు ఉన్నారని ఎన్‌బీఐ ఇటీవల ఒక ప్రకటన తెలిపింది. ఎన్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం ఐర్లాండ్, ఘనాలకు చెందిన వారూ యాంటీ డమ్మీ చట్ట నిబంధనల ఉల్లంఘన కేసులో ఉన్నారు. అయితే ఈ ఆరోపణలను జీఎంఆర్ ప్రతినిధి నిరాధారమైనవిగా పేర్కొన్నారు. కేసు నుంచి బయటపడతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
చట్టం ఏం చెబుతోందంటే..
ఫారిన్ ఈక్విటీ విషయంలో నియంత్రణలు, జాతీయీకరణ చట్ట నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినవారిని శిక్షించడానికి ఫిలిప్పీన్స్ యాంటీ డమ్మీ చట్ట నిబంధనలను తీసుకువచ్చింది. మోసపూరిత ఒప్పందాలు, అవగాహనలను ఈ చట్టం తీవ్రంగా పరిగణిస్తోంది.
కేసు వివరాల్లోకి వెళితే...
అత్యధికంగా బిడ్ దాఖలు చేసిన జీఎంఆర్, ఫిలిప్పీన్స్ మెగావైడ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ కన్సార్షియంకు 2014లో విమానాశ్రయ కాంట్రాక్ట్ దక్కింది. నిర్మాణం, అభివృద్ధి, ఆధునికీకరణ, విస్తరణ, నిర్వహణకు సంబంధించి 25 సంవత్సరాల పాటు సేవలకుగాను 320 మిలియన్ డాలర్లకు ఈ కాంట్రాక్టును కన్సార్షియం దక్కించుకుంది. అయితే ఈ బిడ్డింగ్ ప్రక్రియలో ఫిలిప్పీన్స్ యాంటీ–డమ్మీ చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్లు తాజాగా మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై న్యాయశాఖ అధికారుల ముందు ఫిర్యాదు దాఖలైంది. అయితే ఈ ఆరోపణలపై ఇంతవరకూ న్యాయ విభాగం నుంచి జీఎంసీఏసీకి సమాచారం లేదు. మక్టాన్–సెబూ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ జనరల్ మేనేజర్ ఒకరిని ఈ ఆరోపణలపై ఇటీవలే ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు సమాచారం. నిజానికి ఈ కాంట్రాక్ట్ కన్సార్షియంకు దక్కడంపై 2014లోనే ఫిలిప్పీన్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే అన్ని పత్రాలూ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 2016లో ఈ పిటిషన్‌ను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇదే విషయాన్ని తన తాజా ప్రకటనలో జీఎంఆర్ ప్రతినిధి ప్రస్తావిస్తూ.. ఈ కాంట్రాక్ట్ పక్రియ మొత్తం చట్టాలకు అనుగుణంగా ఉందని ఆ దేశ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
పునర్నిర్మాణానికి ఓకే...
ప్రతిపాదిత పునర్నిర్మాణ ప్రక్రియకు ఎక్సే్ఛంజీల అనుమతి లభించినట్టు జీఎంఆర్ ఇన్‌ఫ్రా (జీఐఎల్) సోమవారం తెలిపింది. పునర్నిర్మాణంలో భాగంగా ఎనర్జీ, అర్బన్ ఇన్‌ఫ్రా, ఈపీసీ సర్వీసెస్ విభాగాలను జీఐఎల్ నుంచి విడదీసి జీఎంఆర్ పవర్, అర్బన్ ఇన్‌ఫ్రాకు బదిలీ చేస్తారు. జీఐఎల్ పూర్తి స్థాయి ఎయిర్‌పోర్ట్ వ్యాపార సంస్థగా కార్యకలాపాలు సాగిస్తుంది. ఎయిర్‌పోర్టుల వ్యాపారాన్ని విడిగా లిస్ట్ చేయనున్న ట్టు ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ వెల్లడించింది. (చదవండి: ‘మహీంద్రా’ శాంగ్‌యాంగ్ దివాలా)
Comments
Please login to add a commentAdd a comment