సాక్షి, బిజినెస్ బ్యూరో: మాంసాహార ఉత్పత్తులు విక్రయించే గోదావరి కట్స్ సంస్థ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏడు స్టోర్స్ ఉండగా, త్వరలోనే కొంపల్లి తదితర ప్రాంతాల్లో మరో నాలుగు ఏర్పాటు చేయనున్నట్లు సహ వ్యవస్థాపకుడు నిహాల్ వెల్లడించారు. 2 నెలల్లో హైదరాబాద్ వ్యాప్తంగా డెలివరీ సేవలను ప్రారంభిస్తున్నామని, సొంతంగా 50 మందితో డెలివరీ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
ఎక్స్‌ప్రెస్ డెలివరీ కింద 2 గంటల్లో ఇంటికి డెలివరీ చేస్తామన్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లతో పాటు వెబ్‌సైట్ నుంచి కూడా ఆర్డర్ ఇవ్వొచ్చని నిహాల్ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 1,000 వరకూ ఆర్డర్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. కస్టమర్లకు ఆయా ఉత్పత్తులతో తయారు చేసే వంటకాల గురించి వివరించేందుకు ప్రతి స్టోర్‌లో ఒక చెఫ్ అందుబాటులో ఉంటారని నిహాల్ పేర్కొన్నారు.
కరోనాతో హైజీన్ ఫుడ్‌కు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో నాణ్యమైన మాంసాహార ఉత్పత్తులను అందించే లక్ష్యంతో గతేడాది జూన్‌లో గోదావరి కట్స్‌ను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 50కి పైగా మాంసాహార ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు వివరించారు. 20 రకాల సముద్ర ఉత్పత్తుల కోసం కాకినాడ, వైజాగ్ తదితర ప్రాంతాల్లో 200 మంది జాలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. సాల్మన్, లాబ్‌స్టర్ మొదలైన వాటిని నార్వే నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అలాగే సీజన్‌ను బట్టి ఉత్పత్తులను గుజరాత్, ముంబై వంటి ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నామని నిహాల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment