
ముంబై : రికార్డు ధరల నుంచి బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్న పసిడి ధరలు శుక్రవారం కూడా పతనాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 1930 డాలర్లకు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ హాట్ మెటల్స్‌కు డిమాండ్ తగ్గింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 707 రూపాయలు తగ్గి 51,444 రూపాయలకు పడిపోయింది. కిలో వెండి 919 రూపాయలు పతనమై 66,676 రూపాయలకు దిగివచ్చింది.
ఇక గత రెండ్రోజుల్లో బంగారం 1800 రూపాయలు తగ్గగా, వెండి దాదాపు 2000 రూపాయలు తగ్గింది. ఇటీవల పదిగ్రాముల బంగారం 56,191 రూపాయల ఆల్‌టైం హైకి చేరిన అనంతరం పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు రాబోయే రోజుల్లో ఒడిదుడుకులతో సాగినా ధరలు తగ్గుముఖం పడితే కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం ఉందని, అమెరికా..అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సవాళ్లు, అమెరికన్ డాలర్ క్షీణతతో తిరిగి బంగారం ధరలు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ కేసుల పెరుగుదల, అమెరికా-చైనా ఉద్రిక్తతలతో పసిడి ధరలు పుంజుకుంటాయని కొటాక్ సెక్యూరిటీస్ ఓ ప్రకనటలో పేర్కొంది. చదవండి : ఊరట : పసిడి నేల చూపులు