న్యూఢిల్లీ: అవసరాల్లో బంగారాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకునే ధోరణి దేశంలో గణనీయంగా పెరిగిపోతోంది. సంఘటిత రంగం బంగారం రుణాల మార్కెట్ వచ్చే ఐదేళ్లలో రెట్టింపై రూ.14.19 లక్షల కోట్లకు చేరుకుంటుందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. ‘‘అసంఘటిత రంగంలో (వ్యక్తులు, పాన్‌బ్రోకర్ల వద్ద తనఖాలు) ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చు. 2023–24లో సంఘటిత రంగంలో బంగారం రుణాల మార్కెట్ రూ.7.1 లక్షల కోట్లకు చేరుకుంది.
ఏటా 14.85 శాతం కాంపౌండెడ్ చొప్పున పెరుగుతూ 2029 మార్చి నాటికి రూ.14.19 లక్షల కోట్లకు చేరుతుంది’’ అని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. ముఖ్యంగా బంగారం రుణాల్లో 79.1 శాతం వాటాతో దక్షిణాది మార్కెట్ అగ్రగామిగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘భారతీయ కుటుంబాల వద్ద 25,000 టన్నుల బంగారం ఉంటుంది. దీని ప్రస్తుత విలువ రూ.126 లక్షల కోట్లు. బంగారం విలువపై ఇచ్చే రుణం (ఎల్‌టీవీ) విషయంలో ఆర్‌బీఐ కఠిన పరిశీలనల నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో బంగారం రుణాల మార్కెట్ మోస్తరు వృద్ధిని చూడొచ్చని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వివరించింది.
రుణాన్ని నగదు రూపంలో రూ.20 వేలకు మించి ఇవ్వరాదంటూ ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ సూచించిన నేపథ్యంలో.. కస్టమర్లు అసంఘటిత రంగంపై ఆధారపడడం పెరగొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఫిన్‌టెక్ స్టార్టప్‌ల ద్వారా రుణాల జారీ ప్రక్రియపైనా ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఇవే ఎన్‌బీఎఫ్‌సీల షేర్ల ధరలు తగ్గడానికి దారితీశాయంటూ పీడబ్ల్యూసీ తన నివేదికలో వివరించింది.
నిబంధనల అమలుకు ప్రాధాన్యం..
వ్యయ నియంత్రణ చర్యల అమలుతో బంగారం రుణాలు ఇచ్చే ఎన్‌బీఎఫ్‌సీల లాభదాయకత పెరుగుతుందని, ఇన్వెస్టర్ల విశ్వాసం అధికమవుతుందని పీడబ్ల్యూసీ నివేదిక అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో బంగారం ధరలు గణనీయంగా పెరగడం వీటిపై రుణ రేట్ల విషయంలో ఎన్‌బీఎఫ్‌సీలు అప్రమత్తంగా వ్యవహరించేలా చేసినట్టు వివరించింది. బంగారం ధరలు తగ్గుముఖం పడితే అది లోన్ టు వ్యాల్యూ పరిమితిని ఉల్లంఘనకు దారితీస్తుందని, నిర్వహణ పరమైన సమస్యలకు దారితీసి బంగారం వేలం వేయాల్సిన పరిస్థితులు రావొచ్చన్న ఆందోళనను పీడబ్ల్యూసీ నివేదిక ప్రస్తావించింది. బంగారం రుణ మార్కెట్ వృద్ధిని బ్యాంకులతోపాటు ఎన్‌బీఎఫ్‌సీలు నడిపిస్తాయని పేర్కొంది.
బ్యాంక్‌లకు ఎక్కువ లబ్ధి
ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం రుణాల మార్కెట్ అయిన భారత్‌లో.. పరిశ్రమ మరింత వృద్ధి చెందడం వల్ల ఈ రంగంలోని అన్ని సంస్థలు ప్రయోజనం పొందొచ్చని ఈ నివేదిక తెలిపింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా బ్యాంక్‌లకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అంచనా వేసింది. ‘‘బంగారంపై రుణాలన్నవి పూర్వకాలం నుంచి ఉన్న విధానం.. వినియోగదారులతోపాటు, రుణాలిచ్చే సంస్థలకు ఇది ఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఉంటోంది’’అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment