సాక్షి, హైదరాబాద్ : గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ హైదరాబాద్‌లో సెంటర్ ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం హైదరాబాద్‌లో చేపట్టే కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవల సంస్థ ప్రతినిధులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భరోసా ఇచ్చారు. వాణిజ్య, సాంకేతిక దిగ్గజాలకు హబ్‌గా మారిన హైదరాబాద్‌లో అడుగుపెట్టాలని గోల్డ్‌మన్ శాక్స్ నిర్ణయించడంతో తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుంది. భౌగోళికంగా విస్తరించడం, నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలను సమన్వయం చేసుకునే వ్యూహంలో భాగంగా గోల్డ్‌మన్ శాక్స్ హైదరాబాద్‌లో అడుగుపెట్టాలని యోచిస్తోంది.
బెంగళూర్ తర్వాత భారత్‌లో గోల్డ్‌మన్ శాక్స్‌కు హైదరాబాద్ రెండవ కార్యాలయం కానుంది. గోల్డ్‌మన్ శాక్స్ హైదరాబాద్ సెంటర్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో 500 మంది ఉద్యోగులతో కార్యకలాపాలను ప్రారంభించనుంది. కాగా బెంగళూర్ కార్యాలయం భారత్‌లో తమ మేజర్ లొకేషన్‌గా కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. గోల్డమన్ శాక్స్ బెంగళూర్ సెంటర్‌లో 6000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల్లో ఒకటైన గోల్డ్‌మన్ శాక్స్ హైదరాబాద్ రాకను స్వాగతిస్తున్నామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భారత్‌లో తమ రెండో లొకేషన్‌గా హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి : రూ.500 కోట్లివ్వండి
Comments
Please login to add a commentAdd a comment