గూగుల్‌లో వేతనాలు మూడు రెట్లు పెంపు! ఎందుకో తెలుసా? | Google Offered 300 Percent Salary Hike | Sakshi
Sakshi News home page

గూగుల్‌లో వేతనాలు మూడు రెట్లు పెంపు! ఎందుకో తెలుసా?

Published Tue, Feb 20 2024 10:54 AM | Last Updated on Tue, Feb 20 2024 11:29 AM

Google Offered 300 Percent Salary Hike - Sakshi

ద్రవ్యోల్బణ భయాలు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో చాలా టెక్‌ కంపెనీలు కాస్ట్‌కటింగ్‌ పేరిట ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలకడం, వేతనాల్లో కోత విధించడం వంటి చర్యలకు పూనుకుంటున్నాయి.

అందుకు భిన్నంగా గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంటుంది. మంచి నైపుణ్యాలు కలిగి ఉండే ఉద్యోగార్థులకు మరింత జీతం ఎక్కువ ఇచ్చైనా వారి సేవలు వినియోగించుకునేందుకు ముందుకొస్తుంది. తాజాగా ఒక నిపుణుడిని అట్టేపెట్టుకునేందుకు టెక్‌ దిగ్గజం గూగుల్‌ అతడి జీతాన్ని 300 శాతం పెంచేందుకు సిద్ధమయ్యింది. 

గూగుల్‌లో పనిచేస్తున్న సదరు నిపుణుడు పర్‌ప్లెక్సిటీ ఏఐకి మారాలని నిర్ణయించుకున్నాడు. దాంతో గూగుల్‌ అతడి జీతాన్ని గణనీయంగా పెంచడం ద్వారా ఆ ఉద్యోగ మార్పును నిలువరించిందని పర్‌ప్లెక్సిటీ సీఈఓ అరవింద్‌ శ్రీనివాస్‌ ఇటీవల బిగ్‌ టెక్నాలజీ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్‌ ‘ప్రధాన టెక్‌ కంపెనీలు తమ కీలక నిపుణులను నిలబెట్టుకునేందుకు ఎలా ప్రవర్తిస్తాయన్న విషయాన్ని’ వివరించేందుకు ఉదాహరణగా ఈ సంఘటనను తెలిపారు. 

ఇదీ చదవండి: 2024లో హైదరాబాద్‌లో పూర్తికానున్న ఇళ్లు ఎన్నంటే..

ఆ నిపుణుడికి కృత్రిమమేధ (ఏఐ) విభాగంతో ప్రత్యక్ష సంబంధం లేదనీ, సెర్చ్‌ బృందంలో సభ్యుడిగా ఉన్నారని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. అయినా, ఏఐ సంస్థకు మారేందుకు ప్రయత్నించినప్పుడు గూగుల్‌ ఈ చర్యలకు పూనుకుందన్నారు. టెక్‌ పరిశ్రమలో తొలగింపుల గురించి ఆయన మాట్లాడుతూ.. కంపెనీ ఉత్పాదకతకు పెద్దగా ఉపకరించకున్నా, అధిక జీతాలు పొందుతున్న ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో ఐటీ రంగంలో 32,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement