దేశీయ సాంకేతిక రంగాన్ని ప్రభావితం చేస్తున్న గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ) టైర్-2 నగరాలకు విస్తరిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో పనిచేయాలనుకునే ప్రతిభ ఉన్న అభ్యర్థులకు భారీ వేతనాలు ఇస్తున్నట్లు టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక తెలిపింది. జీసీసీలు సంప్రదాయ ఐటీ, నాన్-టెక్ కంపెనీలతో పోలిస్తే 12 నుంచి 20 శాతం ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు పేర్కొంది.
టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. దేశంలో 1,600 జీసీసీలున్నాయి. వీటిలో 16.6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలు ప్రధానంగా జనరేటివ్ ఏఐ, ఏఐ/ ఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్.. వంటి టెక్నాలజీలపై దృష్టి సారిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల 2025 నాటికి జీసీసీల సంఖ్య 1,900కు చేరనుంది. దాంతో 20 లక్షల మంది ఈ విభాగంలో ఉపాధి పొందుతారు. వచ్చే ఏడాది నాటికి భారతీయ టెక్ పరిశ్రమలో ఏఐ, ఎంఎల్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీల్లో సుమారు రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దీని వాటా రూ.21 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.
ఇదీ చదవండి: విభిన్న రంగాల్లో ఏఐ ఆధారిత స్టార్టప్‌లు
ఈ సందర్భంగా టీమ్‌లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ విజ్ మాట్లాడుతూ..‘సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీ, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్, డేటా మేనేజ్‌మెంట్, అనలిటిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్.. వంటి కీలకమైన ఫంక్షనల్ రంగాల్లో 15,000 ఉద్యోగాలు కల్పనకు అవకాశం ఉంది. బెంగళూరు, గుర్‌గావ్, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో టెక్ ఉద్యోగాలకు అధిక వేతనాలు అందిస్తున్నారు. జైపూర్, ఇందోర్, కోయంబత్తూర్ వంటి టైర్-2 నగరాలు రాబోయే రోజుల్లో జీసీసీలు, డేటా సెంటర్‌లకు హబ్‌లుగా మారబోతున్నాయి. ఈ కేంద్రాల్లోని ఉద్యోగులకు సంప్రదాయ ఐటీ జీతాల కంటే 12% నుంచి 20% వరకు ఎక్కువ వేతనం చెల్లిస్తారు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment