
న్యూఢిల్లీ: ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మీదైనా ప్రభుత్వానికి వ్యక్తిగతంగా వ్యతిరేకత ఏమీ ఉండదని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. చట్టాలు, నిబంధనల అమలు కోణంలో మాత్రమే ప్రభుత్వానికి, సోషల్ మీడియాలకు సంబంధం ఉంటుందని ఆయన తెలిపారు. ప్లాట్‌ఫామ్‌లు కచ్చితంగా భారతీయ చట్టాలను గౌరవించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. కోవిన్ ప్లాట్‌ఫామ్‌లో డేటా ఉల్లంఘన జరిగిదంటూ వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు.
టెలిగ్రాం బాట్ ద్వారా బైటికొచ్చిన వ్యక్తిగత సమాచారమేదీ కోవిన్ డేటాబేస్‌లోనిది కాదని తెలిపారు. ఒక వ్యక్తికి చెందిన డేటాబేస్ నుంచి సదరు సమాచారం లీక్ అయ్యిందని, అదంతా నకిలీదేనని ఆయన చెప్పారు. అయినప్పటికీ, ఆ సమాచారం ఎంత పాతది, ఎక్కడి నుంచి వచ్చింది మొదలైన అంశాలపై విచారణ జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. రైతుల ఆందోళన సమయంలో తాము చెప్పినట్లు చేయకపోతే ట్విటర్‌ను మూసివేస్తామని ప్రభుత్వం బెదిరించిందంటూ కంపెనీ మాజీ సీఈవో జాక్ డోర్సే చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. ఇది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. భారతీయ చట్టాలకు విరుద్ధంగా పని చేస్తున్నప్పటికీ ట్విటర్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment