వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి ఒక్కసారిగా కిందికి దూకుతూ చేసే స్కై డైవింగ్ వీడియో కనిపిస్తే.. మనం కూడా కళ్లప్పగించి చూస్తాం. అంత ప్రమాదకరమైన అడ్వెంచర్ మనకి అవసరమా అనుకుంటాం. అయితే ఇప్పుడు ఏ ప్రమాదం లేకుండా ఆ అడ్వెంచర్ చేసే అవకాశం హైదరాబాదీలకు దక్కనుంది.
హైదరాబాద్ నగరానికి మరో ఆకర్షణ జత కానుంది. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా స్కై డైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు నగరం రెడీ అవుతోంది. ఆకాశ వీధిలో విహరించే అనుభూతి కల్పించేందుకు గ్రావిటీజిప్ అనే స్టార్టప్ రంగం సిద్ధం చేసింది. నగరానికి చెందిన మేడ రామ్, మేడ సుశీల్‌లు గండిపేట సమీపంలో ఇండోర్ స్కై డైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు గ్రావిటీజిప్ అడ్వెంచర్ స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేశారు.
అడ్వెంచర్‌కు మారు పేరైన స్కైడైవింగ్‌కి యూరప్ కంట్రీస్‌లో స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మన దగ్గరి నుంచి కూడా చాలా మంది యూరప్‌కి వెళ్లి స్కై డైవింగ్ చేసి వస్తుంటారు. ఈ అడ్వెంచర్ చేయాలంటే నెలల తరబడి శిక్షణ అవసరం, అదే విధంగా ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి ఝంజాటం ఏమీ లేకుండా ఇలా వెళ్లి అలా ఇండోర్‌లో స్కైడెవింగ్ చేసి రావొచ్చు.
తక్కువ ఖర్చుతో, అన్ని రకాల జాగ్రత్తలతో ఆర్టిఫిషియల్ స్కైడైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది గ్రావిటీజిప్. గండిపేట సమీపంలో ఆర్టిఫిషియల్ స్కైడైవింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. 2022 మార్చి, ఏప్రిల్‌లలో దీన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు యూరప్‌లో శిక్షణ పొందిన సిబ్బందిని ఇక్కడి నియమించారు. ఇండోర్ స్కైడైవింగ్ కోసం 23 అడుగుల ఎత్తుతో ప్రత్యేక సిలిండర్ రూపొందించారు. స్కైడైవింగ్‌కి మూడు వేల రూపాయల వరకు టికెట్ ఛార్జ్ ఉండవచ్చని అంచనా.
చదవండి: బెంగళూరు, ఢిల్లీ బాటలో హైదరాబాద్.. స్టార్టప్‌లకు మంచి రోజులు
Comments
Please login to add a commentAdd a comment