
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు అక్టోబర్‌లో భారీగా రూ.1.72 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో పోల్చితే ఈ పరిమాణం 13 శాతం అధికంకాగా, 2017 జూలైలో ప్రారంభం తర్వాత ఇవి రెండవ భారీ స్థాయి వసూళ్లు. ఇంతక్రితం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ప్రారంభ నెల ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్ల రికార్డు స్థాయి వసూళ్లు జరిగాయి. ఎకానమీ క్రియాశీలత, పన్నుల ఎగవేతలను అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు, వసూళ్ల వ్యవస్థలో సామర్థ్యం పెంపు, పండుగల డిమాండ్ తాజా సానుకూల వసూళ్లకు కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రానున్న నెలల్లో సైతం ఇదే ధోరణి కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాయి.
విభాగాల వారీగా..
- మొత్తం వసూళ్లు రూ.1,72,003 కోట్లు.
- ఇందులో సీజీఎస్‌టీ వాటా రూ.30,062 కోట్లు.
- స్టేట్ జీఎస్‌టీ వసూళ్లు రూ.38,171 కోట్లు
- ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.91,315 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.42,127 కోట్లతో సహా)
- సెస్ రూ.12,456 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.1,294 కోట్ల వసూళ్లుసహా)
ఆర్థిక సంవత్సరంలో తీరిది..
ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో చరిత్రాత్మక స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మే, జూన్ నెలల్లో వరుసగా రూ.1.57 లక్షల కోట్లు, రూ.1.61 లక్షల కోట్లు ఒనగూరాయి. జూలై వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు. ఆగస్టు వసూళ్లు రూ. 1.59 లక్షల కోట్లుకాగా, సెప్టెంబర్‌లో రూ. 1.63 లక్షల కోట్ల జీఎస్‌టీ రాబడి నమోదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment