జనవరి–జూన్ మధ్య 21శాతం అప్
నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కళకళలాడుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (జనవరి–జూన్) బలమైన పనితీరు నమోదు చేసిందిజ ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూస్తే 21 శాతం పెరిగి 18,573 యూనిట్లకు చేరాయి. ఇదే కాలంలో ఆఫీస్ వసతులకు డిమాండ్ 71 శాతం పెరిగి 5 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో ఇళ్ల విక్రయాలు జనవరి–జూన్ కాలంలో 11 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. 1.73 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఎనిమిది నగరాల్లో ఆఫీస్ వసతుల లీజింగ్ 33 శాతం పెరిగి 34.7 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ గడిచిన కొన్ని త్రైమాసికాల్లో బలంగా ఉండడం బలమైన ఆర్థిక మూలాలాలను, స్థిరమైన సామాజిక ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు.
దీని ఫలితమే ఇళ్ల అమ్మకాలు, కార్యాలయ వసతుల లీజింగ్ దశాబ్ద గరిష్ట స్థాయికి చేరుకోవడంగా పేర్కొన్నారు. 2024 తొలి ఆరు నెలల్లో మొత్తం అమ్మకాల్లో 34 శాతం ఖరీదైన ఇళ్లే ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడం ఆఫీస్ వసతుల డిమాండ్‌పై సానుకూల ప్రభావం చూపించింది. స్థిరమైన సామాజిక ఆర్థిక పరిస్థితులకు తోడు, ప్రస్తుత వృద్ధి జోరు ఆధారంగా 2024 సంవత్సరం మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు, వాణిజ్య వసతుల లావాదేవీలు బలంగా నమోదవుతాయనే అంచనా వేస్తున్నాం’’అని బైజాల్ వివరించారు.
పట్టణాల వారీగా గణాంకాలు..
→ ముంబై నగరంలో ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో 47,259 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలి్చచూస్తే 16 శాతం అధికం. ఇక ఆఫీస్ వసతుల లీజింగ్ పరిమాణం 79 శాతం వృద్ధితో 5.8 మిలియన్ చదరపు అడుగులకు చేరింది.
→ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఇళ్ల అమ్మకాలు 4 శాతం పెరిగి 28,998 యూనిట్లుగా ఉన్నాయి. ఆఫీస్ స్పేస్ డిమాండ్ 11.5 శాతం పెరిగి 5.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది.
→ బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 4 శాతం వృద్ధితో 27,404 యూనిట్లకు చేరాయి. కార్యాలయ స్థలాల లీజింగ్ 21 శాతం పెరిగి 8.4 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది.
→ పుణెలో 24,525 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇది 13 శాతం వృద్ధికి సమానం. ఆఫీస్ వసతుల లీజింగ్ 88 శాతం పెరిగి 4.4 మిలియన్ చదరపు అడుగులకు చేరింది.
→ చెన్నైలో 12 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 7,975 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్ వసతులకు డిమాండ్ 33 శాతం తగ్గి 3 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది.
→ కోల్‌కతాలో 9,130 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూస్తే 25 శాతం పెరిగాయి. ఆఫీస్ స్పేస్ లీజు సైతం 23 శాతం వృద్ధితో 0.7 మిలియన్ చదరపు అడుగులకు చేరింది.
→ అహ్మదాబాద్ పట్టణంలో ఇళ్ల అమ్మకాలు 17 శాతం వృద్ధితో 9,377 యూనిట్లకు చేరాయి. ఆఫీస్ వసతుల లీజింగ్ భారీ వృద్ధితో 1.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది.
సానుకూల పరిస్థితుల
అన్ని ధరల విభాగాల్లో ఇళ్ల అమ్మకాలు బలంగా ఉన్నట్టు గురుగ్రామ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు. అధిక వృద్ధికితోడు, మౌలిక వసతుల అభివృద్ధి డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు. సొంతిల్లు కలిగి ఉండాలనే అభిలాష, కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు ఈ వృద్ధిని ప్రధానంగా నడిపిస్తున్నాయని ప్రాపర్టీ ఫస్ట్ రియల్టీ వ్యవస్థాపకుడు, సీఈవో భవేష్ కొఠారి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment