హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల విక్రయాలు | Housing sales in top 8 cities decline by 6percent in Apr-Jun 2024 | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల విక్రయాలు

Published Fri, Jul 12 2024 5:37 AM | Last Updated on Fri, Jul 12 2024 9:39 AM

Housing sales in top 8 cities decline by 6percent in Apr-Jun 2024

ఏప్రిల్‌–జూన్‌ కాలంలో  14శాతం క్షీణత 

ప్రముఖ నగరాల్లో 6 శాతం డౌన్‌ 

ప్రాప్‌టైగర్‌ నివేదిక వెల్లడి 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు జూన్‌ త్రైమాసికంలో తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలోని గణాంకాలతో పోలి్చచూస్తే 14 శాతం తగ్గి రూ.12,296 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి–మార్చి కాలంలో 14,298 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోవడం గమనార్హం. 

దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో 6 శాతం తగ్గి 1,13,768 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్‌టైగర్‌ (ఆర్‌ఈఏ ఇండియా గ్రూప్‌) వెల్లడించింది. జనవరి–మార్చి క్వార్టర్‌లో ఈ నగరాల్లో విక్రయాలు 1,20,642 యూనిట్లుగా ఉన్నాయి. జూన్‌ త్రైమాసికంలో ఇళ్ల మార్కెట్‌ పనితీరుపై ప్రాప్‌టైగర్‌ ఒక నివేదిక విడుదల చేసింది. ఇక ఈ ఎనిమిది పట్టణాల్లో అమ్మకాలు, క్రితం ఏడాది ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో విక్రయాలు 80,245 యూనిట్లతో పోల్చి చూస్తే 42 శాతం పెరిగాయి.

 ‘‘రియల్‌ ఎస్టేట్‌ పట్ల వినియోగదారుల్లో సానుకూల ధోరణి నెలకొన్నప్పటికీ, ఏప్రిల్‌–జూన్‌ కాలంలో ఇళ్లకు డిమాండ్‌ మోస్తరుగా ఉండడానికి సాధారణ ఎన్నికలే కారణం. డెవలపర్లు సైతం కొంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఫలితమే కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ సైతం తగ్గింది. కేంద్రంలో నూతన ప్రభుత్వం పెట్టుబడుల అనుకూల బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందన్న అంచనాల మధ్య రానున్న త్రైమాసికాల్లో, ముఖ్యంగా పండుగల రోజుల్లో ఇళ్ల అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని ఆర్‌ఈఏ ఇండియా గ్రూప్‌ సీఎఫ్‌వో వికాస్‌ వాద్వాన్‌ పేర్కొన్నారు.  

పట్టణాల వారీగా విక్రయాలు
→ అహ్మదాబాద్‌లో ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 26 శాతం తగ్గి 9,500 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో విక్రయాలు 12,915 యూనిట్లుగా ఉన్నాయి. 
→ బెంగళూరులో 13,495 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మార్చి త్రైమాసిక విక్రయాలు 10,381 యూనిట్లతో పోలిస్తే 30 శాతం పెరిగాయి. 
→ చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 10 శాతం వృద్ధితో 3,984 యూనిట్లకు చేరాయి. మార్చి క్వార్టర్‌లో విక్రయాలు 4,427 యూనిట్లుగా ఉన్నాయి.  
→ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 11,065 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. మార్చి త్రైమాసికంతో పోల్చితే 10 శాతం పెరిగాయి. 
→ కోల్‌కతా మార్కెట్లో 3,237 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. జనవరి–మార్చి క్వార్టర్‌లో విక్రయాలు 3,857 యూనిట్లుగా ఉన్నాయి. 
→ ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో ఇళ్ల అమ్మకాలు 8 శాతం క్షీణించి 38,266 యూనిట్లకు పరిమితమయ్యాయి. 
→ పుణె మార్కెట్లోనూ 5 శాతం క్షీణతతో 21,925 యూనిట్ల విక్రయాలు జరిగాయి.  
→ కొత్త ఇళ్ల సరఫరా అంతక్రితం త్రైమాసికంతో పోలి్చతే జూన్‌ క్వార్టర్‌లో 1 శాతం తగ్గి 1,01,677 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్‌టైగర్‌ నివేదిక వెల్లడించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement