అవును, ప్రస్తుతం ఆదాయపు పన్ను లెక్కించే సాధనం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రత్యక్ష ఆదాయపు పన్ను బోర్డ్ పోర్టల్‌లో ఇది ఉంటుంది. బోర్డు వారే దీన్ని తయారుచేసి, అమల్లోకి తెచ్చారు. నిజానికి బోర్డు వారు ఆదాయపు పన్ను అసెసీలకు సులువుగా, త్వరగా, స్వంతంగా లెక్కించుకునే ఎన్నో సాధనాలు తెచ్చారు. అందులో ఇది కూడా ఒకటి. ఇది రెండు సంవత్సరాలకు వర్తిస్తుంది.
మొదటిది. 01–04–2021 నుండి 31–3–2022తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరానికి..అంటే 2021–22..ఇన్‌కం ట్యాక్స్ పరిభాషలో చెప్పాలంటే అసెస్‌మెంట్ 2022–23 సంవత్సరం. దీనికి గాను మీరు రిటర్నులు 31–07–2022 లోపల వేయాలి. ఎవరు వేయాలి? ఏ పరిస్థితుల్లో రిటర్న్ వేయాలి? ఏం ఫారం ఐటీఆర్ దాఖలు చేయాలి .. ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలకు జవాబులు గతంలో ఎన్నో సార్లు ఇచ్చాం.
చదవండి: కొత్త రూల్స్, వీళ్లు తప్పని సరిగా ఐటీ రిటర్న్ దాఖలు చేయాల్సిందే!
ఇదొక ఆన్‌లైన్ సాధనం. రెడీమేడ్ కాల్‌క్యులేటర్. ఇది ఉచితం. సులభమైన సాధనం. తప్పులుండే అవకాశమే లేదు. చాలా త్వరగా అవుతుంది. మీరు మీ వివరాలతో లాగిన్ అయితే.. ఈ సాధనం ఒక మార్గదర్శినిలాగా పని పూర్తి చేస్తుంది.
అయితే, ఒక పని చేయాలి. సంబంధిత కాగితాలను మీ ఎదురుగా పెట్టుకుని సంబంధిత సమాచారాన్ని సరైన ఫీల్డులో నింపుతూ ముందుకెళ్లండి. అన్ని వివరాలు సరిగ్గా ఇవ్వండి. కొన్ని అంశాలు మీకు వర్తించకపోతే ‘‘0’’ అని రాయండి. మీకున్న రెండు ఆప్షన్ల ప్రకారం స్టేట్‌మెంట్ రెడీ, ట్యాక్స్ లయబిలిటీ రెడీ. ఇన్‌స్టంట్ ఫుడ్ లాగా అంతా సిద్ధం. మరొక సారి చెక్ చేసుకుని మీరు మీ రిటర్న్‌ని ఫైల్ చేసుకోవచ్చు. వృత్తి నిపుణుల సహాయం అక్కర్లేదు. సరైన సమాచారం సరిగ్గా నింపి, మీరు సరైన ఆప్షన్ తీసుకుంటే సరిపోతుంది.
ఇక రెండోది. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం 01–04–22 నుండి 31–03–23 అంటే 2022–23.. ఇన్‌కం ట్యాక్స్ వారి పరిభాషలో 2023–24 అసెస్‌మెంట్ సంవత్సరం విషయం తీసుకుంటే.. ఇది కూడా ఇంచు మించు పైన చెప్పిన విధంగానే ఉంటుంది. మీకెంత ఆదాయం ఉంటుందో, ఎంత వస్తుందో ఊహించి, అంచనా వేసుకుని అంశాలవారీగా సరైన ఫీల్డ్‌లో నింపాలి. గడిచిన సంవత్సరానికి సంపాదించినది.. నడుస్తున్న సంవత్సరానికి సంపాదించబోయేది.. అంటే వ్యత్యాసం .. గతం .. వర్తమానం .. ఇలా అన్ని విషయాలు సమగ్రంగా పొందుపర్చాకా స్టేట్‌మెంట్ ‘‘రెడీ’’గా కనిపిస్తుంది.
మీకు తెలిసే ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాల్సిన వారు ట్యాక్స్ లయబిలిటీ మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో చెల్లించాలి. మొదటి విడత జూన్ 15. రెండోది సెప్టెంబర్ 15. మూడోది డిసెంబర్ 15. నాలుగోది..ఆఖరుది మార్చి 15. ఇలా నాలుగు విడతల్లో మొత్తం లయబిలిటీని లెక్కిస్తుంది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు. ఆర్థికంగా ముందే ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్, ఖర్చులు మొదలైనవి ప్లాన్ చేసుకోవచ్చు. మధ్యలో మార్పులు వస్తే, ఆ మార్పులతో మళ్లీ లెక్కించుకోవచ్చు.
ఏ మార్పుకైనా ఇది అనువుగా ఉంటుంది. చాలా మంచి ఎస్టిమేటర్. చివరగా చెప్పాలంటే ఈ సాధనం ఒకటే .. ఆర్థిక సంవత్సరం మారితే లయబిలిటీని తెలియజేస్తుంది. గడిచిన సంవత్సరం రిటర్న్ వేయటానికి పనికివస్తుంది. నడుస్తున్న సంవత్సరం ప్లానింగ్‌కి కూడా పనికొస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే రంగంలోకి దూకండి.
Comments
Please login to add a commentAdd a comment