మీ అందరికీ ముందుగా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ’శోభకృత్’ సంవత్సరంలో మీరింగా శోభాయమానంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ మధ్యే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక ప్రకటన జారీ చేసింది. గతంలో తెచ్చిన మార్పుల ప్రకారం మీరు రిటర్నుని అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ రిటర్ను పేరు ఐటీఆర్‌యూ ఒకప్పుడు రివైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అది లేదు. దానికి బదులుగా వచ్చింది.
ఇంద్రుడిని సహస్రాక్షుడు అని కూడా అంటారు. అంటే వేయి కన్నులవాడు అని అర్థం. ప్రస్తుతం డిపార్టుమెంటు వారు కూడా అదే అవతారం ఎత్తారు. వారి దగ్గరున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా అసెసీల గురించి ఎంతో ఎక్కువ సమాచారాన్ని సేకరించారు. ఇందులో రెండు రకాలుంటాయి. మనం అసలు రిపోర్ట్ చేయనివి ఒకటైతే.. రెండోది.. సగం, తక్కువగా, కొంత మాత్రమే రిపోర్ట్ చేసినవి. గతంలో 26 అ లో సమాచారం ఉండేది. ఇప్పుడు అఐ ద్వారా సరైనది, సమగ్రమైనది, సంపూర్ణంగా ఉండే సమాచారాన్ని సేకరించారు. 2019 ఏప్రిల్ 1 నుంచి మన లావాదేవీలకు సంబంధించిన లావు చిట్టా. ఇది ప్రస్తుతం మీ ఖాతాలో ప్రతిబింబిస్తుంది. మీరు చెక్ చేసుకోండి. గడిచిన చరిత్ర.. కుండలీకరణం.
2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను 68,000 మంది ఆర్థిక జాతకం బయటపడింది. వీరందరికీ బొట్టుపెట్టి పిలిచి ‘ఇదిగో మీ జాతకం‘ అని చూపించారు. చిలక్కి చెప్పినట్లు చెప్పారు. కేవలం 35,000 మంది మాత్రమే బదులుగా తమ రిటర్నులను అప్‌డేట్ చేసుకున్నారు. అంటే గతంలో వేసిన దానికి, అఐ లో సమాచారంతో పోల్చి చూసుకుని తమ రిటర్నులను సవరించుకున్నారు. సవరణ.. అంటే ఆదాయాన్ని పెంచి చూపించి వేశారు. మిత్ర లాభంలో మూడు చేపల కథలో రెండో చేప ’కుశాగ్రబుద్ధి’ లాంటి వాళ్లు, మూడవ చేపలాగా మందబుద్ధులైన మిగతావారికి మరో అవకాశం ఇస్తూ డిపార్టుమెంటు తాజా ప్రకటన చేసింది. వారి మీద కఠిన చర్యలు తీసుకునే ముందు ఇది ఒక హెచ్చరిక.
ఈ ప్రచారంలో భాగంగానే పేరు పేరున ‘2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు మీ ఖాతాలో ముఖ్యమైనవి, పెద్దవి అయిన ఆర్థిక వ్యవహారాలు జరిగాయి. ఆ వివరాలను పదిలంగా మా దగ్గర భద్రపరిచాం. వెంటనే చూడండి. పరికించండి. పరీక్షించండి. మా పోర్టల్‌లో లాగిన్ అవ్వండి. ఇవిగో మీరు నడిపించిన వ్యవహారాలు. అవసరమైతే తగిన అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి‘ అంటూ ఎంతో మందికి వర్తమానం పంపించారు. అలా వచ్చిన వారు వెంటనే లాగిన్ అయి చెక్ చేసుకోండి. అవసరం అయితే వాటిని పరిగణనలోకి తీసుకోండి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి. ఇప్పటికే వాటిని పరిగణించి, తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే.. మిత్రలాభంలో మొదటి చేప ‘దూరదర్శి‘లాగా ఊపిరి పీల్చుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment