ఒకేసారి ఫ్లెక్సీక్యాప్, లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?
– వెంకట్రామన్ శ్రీనివాసన్
మీకు ఈక్విటీల గురించి మెరుగైన అవగాహన ఉంటే అప్పుడు లార్జ్‌క్యాప్, మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు పెట్టుబడులను కేటాయించుకోవచ్చు. తద్వారా పోర్ట్‌ఫోలియోని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి బదులు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మరింత మెరుగైన ప్రత్యామ్నాయం అవుతుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు అన్ని రకాల మార్కెట్ విలువ కలిగి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కాకపోతే ఆయా మార్కెట్ విభాగాలకు ఫ్లెక్సీక్యాప్‌లో కేటాయింపులు వేర్వేరుగా ఉండొచ్చు.
ఉదాహరణకు ఫ్లెక్సీక్యాప్ పథకాలు లార్జ్‌క్యాప్ కంపెనీలకు ఎక్కువ కేటాయిపులు చేస్తుంటాయి. మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలకు తక్కువ కేటాయింపులు చేస్తుంటాయి. అందుకని పెట్టుబడి మొత్తాన్ని ఒకే ఫ్లెక్సీక్యాప్ పథకంలో కాకుండా, కనీసం మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కనుక విడిగా లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాబోదు. ఎక్కువ రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు అయితే ఒకవైపు ఫ్లెక్సీక్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తూనే, మరోవైపు 15 శాతం వరకు పెట్టుబడులను మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవడం ద్వారా మెరుగైన రాబడులు సమకూర్చుకోవచ్చు.
నేను రూ.7 లక్షలు రుణంపై కారు కొనుగోలు చేశాను. దీన్ని ముందుగా తీర్చివేయాలన్నది నా ప్రణాళిక. ఇందుకోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుకూలమైన పథకాలు ఏవి? పీజీఐఎం ఇండియా మిడ్‌క్యాప్ అపార్చునిటీస్ ఫండ్‌లో రాబడులను ప్రతి మూడేళ్లకోసారి వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయమేనా?
– ఆదిత్య బి
కారు రుణాన్ని ముందుగా తీర్చివేయాలనుకోవడం మంచి నిర్ణయం. విలువ తరిగిపోయే కారు వంటి ఆస్తి కోసం రుణం తీసుకోవడం సూచనీయం కాదు. మీరు మీ కారు రుణాన్ని ఏడేళ్లలోపు తీర్చివేయాలని అనుకుంటున్నారు. కనుక స్వల్పం నుంచి మధ్యస్థ కాలానికి వీలుగా మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవాలి.
పెట్టుబడులను కాపాడుకోవడంతోపాటు, రాబడులు కూడా ఇక్కడ కీలకం అవుతాయి. మీ కారు రుణాన్ని ముందుగా చెల్లించి వేయడం కోసం మీరు హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీతోపాటు డెట్‌లోనూ ఈ పథకాలు పెట్టుబడులు పెడతాయి. దీంతో మీ పెట్టుబడి వృద్ధి చెందుతుంది. మార్కెట్ల పతనం, అస్థిరతలను ఎదుర్కొనే రక్షణ ఉంటుంది.
మూడేళ్ల తర్వాత మీ కారు రుణాన్ని ముందుగా చెల్లించి వేయడం కోసం ప్రతి నెలా ఆదాయంలో మిగులును అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మూడు నుంచి నాలుగేళ్లలోపే కారు రుణం తీర్చివేయాలని అనుకుంటే అందుకోసం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
కారు రుణాన్ని ముందుగా వదిలించుకునేందుకు మీవద్ద నెలవారీ మిగిలే మొత్తం కీలక పాత్ర పోషిస్తుంది. ఇక పీజీఐఎం ఇండియా మిడ్‌క్యాప్ అపార్చునిటీస్ అనేది మిడ్‌క్యాప్ పథకం. మిడ్‌క్యాప్ ఫండ్స్ సహజంగా స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి అస్థిరతలతో ఉంటాయి. దీర్ఘకాలంలో ఇవి మెరుగైన రాబడులు ఇవ్వగలవు. కనుక మూడేళ్లకోసారి లాభాలను వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయం అవ్వదు.
ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment