హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ గృహాల అద్దెల వృద్ధిలో హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. బెంగళూరు, ముంబై, పుణే, ఢిల్లీ–ఎన్‌సీఆర్ వంటి దేశంలోని ఏ ప్రధాన మెట్రో నగరాలతో పోల్చినా సరే.. 2014 నుంచి 2020 మధ్య నగరంలో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ రెంట్లు 26 శాతం పెరిగాయి. ఇదే సమయంలో లగ్జరీ గృహాల ధరలు 12 శాతం వృద్ధి చెందాయని అనరాక్ ప్రాపర్టీ కన్సలెంట్ తెలిపింది. 2014లో హైటెక్ సిటీలో రూ.42 వేలుగా ఉన్న అద్దెలు.. 2020 నాటికి 26 శాతం వృద్ధితో రూ.53 వేలకు పెరిగింది. జూబ్లిహిల్స్‌లో రూ.47 వేల నుంచి 15 శాతం పెరిగి రూ.54 వేలకు చేరింది. ఇక క్యాపిటల్ ప్రైస్‌లు చూస్తే.. 2014లో హైటెక్‌సిటీలో చదరపు అడుగు (చ.అ) ధర రూ.5,088గా ఉండగా.. 2020 నాటికి 12 శాతం పెరిగి రూ.5,675కి చేరింది. జూబ్లిహిల్స్‌లో రూ.6,300 నుంచి 10 శాతం వృద్ధితో రూ.6,950కి పెరిగింది.
ఏడు నగరాల్లో ఏటా 3-6 శాతం వృద్ధి..
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే లగ్జరీ హోమ్స్ సగటు నెలవారీ అద్దె గత ఆరేళ్లలో 17–26 శాతం, మూలధన విలువ గరిష్టంగా 15 శాతం మేర పెరిగాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ చైర్మన్ అనుజ్ పూరీ తెలిపారు. టాప్ లగ్జరీ మార్కెట్లలో ప్రతి ఏటా అద్దెలు 3–6 శాతం పెరుగుదలతో స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని పేర్కొన్నారు.
క్యాపిటల్ ప్రైస్‌లలో మాత్రం మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయన్నారు. కొన్ని సంవత్సరాలలో వార్షిక పెరుగుదల 7 శాతంగా ఉంటే.. 2017లో మాత్రం 5 శాతం ధరలు క్షీణించాయని తెలిపారు. ఎందుకంటే ఆ సంవత్సరంలో రెరా, జీఎస్‌టీ వంటి వివిధ నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేశారు. దీంతో చాలా ప్రాంతాల్లో సగటు మూలధన ధరలలో 1–3 శాతం పెరుగుదల మాత్రమే నమోదయింది.
నగరాల వారీగా చూస్తే..
2014తో పోలిస్తే 2020లో గుర్గావ్‌లోని గోల్ఫ్‌కోర్స్ రోడ్‌లో లగ్జరీ గృహాల అద్దెలు 18 శాతం, ఇదే కాలంలో ఈ ప్రాంతంలో గృహాల ధరలు 8 శాతం వృద్ధి చెందాయి. బెంగళూరులోని జేపీ నగర్‌లో అద్దెలు 24 శాతం, ధరలు 8 శాతం, చెన్నైలోని అన్నానగర్‌లో రెంట్స్ 17 శాతం, ప్రాపర్టీ ప్రైస్‌లు 10 శాతం, కోల్‌కత్తాలోని అలీపోర్‌లో రెంట్స్ 20 శాతం, ధరలు 13 శాతం, ఎంఎంఆర్‌లోని టార్డియోలో కిరాయిలు 23 శాతం, ధరలు 8 శాతం, పుణేలోని ప్రభాత్‌రోడ్‌లో అద్దెలు 23 శాతం, లగ్జరీ ప్రాపర్టీ ధరలు 5 శాతం పెరిగాయి.
సంస్కరణలు, ఆర్థిక సహాయంతో రియల్టీలో పునరుత్తేజం
ప్రస్తుతం స్తబ్ధుగా ఉన్న దేశీయ రియల్టీ రంగానికి పునరుత్తేజం తీసుకొచ్చేందుకు విధానపరమైన సంస్కరణలు, దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అవసరమని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో జరిగిన ‘రియాలిటీ ఆఫ్ రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్స్’ అనే అంశం మీద జరిగిన వెబినార్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. కోవిడ్–19 మహమ్మారి నుంచి రియల్టీ రంగాన్ని కాపాడుకోవటంలో ప్రతి ఒక్క డెవలపర్, వాటాదారులు భాగస్వామ్యమయ్యారని అయితే ఈ మహమ్మారి ప్రభావం ఇంకా ముగియలేదని.. సవాళ్లను అధిగమించడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇంకా కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. రాబోయే కాలంలో ఈ రంగం పూర్తిగా కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నరెడ్కో జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నిరంజన్ హిర్‌నందాని మాట్లాడుతూ.. లాక్‌డౌన్ తర్వాత రియల్టీ రంగంలో పెరిగిన లావాదేవీలు, సానుకూల వినియోగదారుల డిమాండ్ నమోదవుతుందని తెలిపారు. దేశీయ ఆర్ధిక వ్యవస్థలో సానుకూల వాతావరణం కనిపిస్తుందన్నారు. ఒకవైపు జీడీపీ ‘వీ’ ఆకారపు రికవరీ అవుతుంటే.. మరోవైపు వాణిజ్య రియల్టీ రంగం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. వర్క్ ఫ్రం హోమ్, వర్క్ ఫ్రం రిమోట్ లొకేషన్ వంటి విధానాలతో ఆఫీస్ స్పేస్ రియల్టీ రికవరీ ఆశించిన స్థాయిలో లేదని తెలిపారు. ఆగిపోయిన, ఆలస్యమైన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు కేటాయించిన స్పెషల్ విండో ఫర్ కంప్లీషన్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ అఫర్డబుల్ అండ్ మిడ్–ఇన్‌కం హౌసింగ్ ప్రాజెక్ట్స్ (ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్) నిధుల పరిమాణాన్ని మరింత పెంచాలని కోరారు.
ఈ విధానంలో ఆర్థిక సంస్థలను కూడా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలతో గృహ కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందన్నారు. చరిత్రాత్మక స్థాయిలో గృహ రుణ వడ్డీ రేట్లు తగ్గడం, కొన్ని రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీలను తగ్గించడం వంటి వాటితో గృహ కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ రేణుసుద్ కర్నాడ్ అన్నారు. ప్రాపర్టీ ధరలు పెరగకుండా డెవలపర్లు తమ వంతు కృషి చేయాలని.. దీంతో గృహ విభాగానికి మరిన్ని అవకాశాలుంటాయని సూచించారు. రియల్టీ రంగానికి ప్రభుత్వ అవసరం అయిన ప్రతీ చోట నరెడ్కో తమ వంతు పాత్రని పోషిస్తుందని.. ఇదే సమయంలో డిజిటల్ వైపు కూడా రియల్టీ రంగానికి ప్రోత్సహిస్తే వృద్ధి మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలంటే రిటైల్ రియల్ ఎస్టేట్ వృద్ధి చెందాలని ఎస్‌బీఐ రిటైల్ బిజినెస్ డిప్యూటీ ఎండీ సలోని నారాయణ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment