ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్‌తో కియా, హ్యుందాయ్ మోటార్స్ జట్టు
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల తయారీని చేపట్టే దిశగా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్‌తో దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్, కియా జట్టు కట్టాయి. భారత్‌లో తమ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఇందుకు సంబంధించి ఎక్సైడ్ ఎనర్జీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. దీని ప్రకారం లిథియం–ఐరన్–ఫాస్ఫేట్ (ఎల్‌ఎఫ్‌పీ) సెల్స్ తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు వివరించింది.
స్థానికంగా తయారీ వల్ల బ్యాటరీ వ్యయాలు కొంత మేర తగ్గగలవని, తద్వారా ఇతర సంస్థలతో మరింత మెరుగ్గా పోటీపడగలమని హ్యుందాయ్ మోటర్ .. కియా ఆర్‌అండ్‌డీ విభాగం హెడ్ హుయి వాన్ యాంగ్ తెలిపారు. భారత మార్కెట్లో తమ బ్యాటరీల అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరా తదితర కార్యకలాపాల విస్తరణకు ఎక్సైడ్ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్యం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. హ్యుందాయ్ ప్రస్తుతం భారత్‌లో అయోనిక్ 5, కోనా ఎలక్ట్రిక్ వాహనాలను, కియా ఇండియా ఈవీ6 మోడల్‌ను విక్రయిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment