భారతదేశం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచుతోంది. ఈవీలో ప్రధానపాత్ర పోషించేది బ్యాటరీలే. వీటిలో లిథియం బ్యాటరీలను ఎక్కువగా వాడుతున్నారు. భవిష్యత్తులో వీటి సామర్థ్యం తగ్గాక తిరిగి రీసైక్లింగ్ చేసే వ్యవస్థను రూపొందించాలి. ప్రస్తుత రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలు భవిష్యత్ డిమాండ్‌లను తీర్చలేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా స్థిరమైన వ్యవస్థను ఏర్పరచాలని సూచిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం మరిన్ని స్టార్టప్‌లను ప్రోత్సహించాలని చెబుతున్నారు.
కార్లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు సగటున 7-8 సంవత్సరాలు పనిచేస్తాయి. కస్టమర్ల వినియోగాన్ని బట్టి ఒక దశాబ్దం వరకు మన్నిక రావొచ్చు. అన్ని రకాల లిథియం అయాన్ బ్యాటరీల్లో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్, నికెల్ మాంగనీస్ కోబాల్ట్ ఆక్సైడ్ (ఎన్‌ఎంసీ), లిథియం నికెల్ కోబాల్ట్ అల్యూమినియం ఆక్సైడ్(ఎన్‌సీఏ)లను విరివిగా వాడుతారు. భారత్‌లో ఈవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో ఈ దాతువుల వినియోగం పెరుగుతోంది.
ఈ బ్యాటరీల తయారీలో రెండు ప్రధాన సమస్యలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకటి, బ్యాటరీల్లో వాడే రసాయన దాతువులను సంగ్రహించడం. రెండు, ఈ బ్యాటరీలను వాడిన తర్వాత భూమిలో వేస్తే కలిగే ప్రమాదాలు. ఈ సమస్యలకు ‘రిసైక్లింగ్’ పరిష్కారమని సూచిస్తున్నారు. ప్రస్తుతం రీసైక్లింగ్ పద్ధతుల్లో హైడ్రోమెటలర్జీ, పైరోమెటలర్జీ, డైరెక్ట్ రీసైక్లింగ్, ఇంటిగ్రేటెడ్ కార్బోథర్మల్ రిడక్షన్ వంటి మెకానికల్ ప్రక్రియలు అనుసరిస్తున్నారు. ఈ పద్ధతుల్లో బ్యాటరీలను కంప్రెస్ చేయడం, ముక్కలు చేయడం, ప్రత్యేక ద్రావకాలు లేదా వేడితో కరిగించి విలువైన పదార్థాలను వెలికితీస్తారు. ఈ ప్రక్రియనంతటిని ‘బ్లాక్ మాస్’ అని పిలుస్తారు. భారత్‌లో పైరోమెటలర్జీ(అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్యాటరీలను కరిగించడం)తో పోలిస్తే తక్కువ ఉద్గారాలతో కూడిన హైడ్రోమెటలర్జికల్(ప్రత్యేక ద్రావణాలతో కరిగించడం) ప్రక్రియను ఎక్కువగా వాడుతున్నారు. ఇందులో దాదాపు 95 శాతం యానోడ్, కేథోడ్‌లను సంగ్రహిస్తున్నారు. దేశీయంగా 80% హైడ్రోమెటలర్జీ ప్రక్రియనే వాడుతున్నారు.
ఇదీ చదవండి: నెట్‌వర్క్‌లో అంతరాయం.. బిల్లులో రాయితీ!
అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో మరిన్ని స్టార్టప్‌లకు అవకాశం ఉంది. ఈవీ తయారీ వైపే కాకుండా బ్యాటరీ రీసైక్లింగ్ విభాగంలోనూ కంపెనీలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో రాబోయే ఈ ట్రెండ్‌ను స్టార్టప్‌లు అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. ఈవీ రంగంలో పెట్టుబడి పెట్టే వెంచర్ కాపిటలిస్ట్‌లు ఈ విభాగాన్ని కూడా గమనించాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment