న్యూఢిల్లీ: దేశ ఎగుమతుల్లో వస్తువులను సేవలు అధిగమించనున్నాయి. 2030 మార్చి నాటికి 618.21 బిలియన్ డాలర్లకు (51.92లక్షల కోట్లు) చేరుకుంటాయని స్వతంత్ర పరిశోధనా సంస్థ ‘గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్’ (జీటీఆర్‌ఐ) అంచనా వేసింది. అదే కాలంలో వస్తు ఎగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది.
2018–19 నుంచి 2023–24 వరకు దేశ వస్తు ఎగుమతులు ఏటా 5.8 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి చెందాయని, ఇదే కాలంలో సేవల ఎగుమతులు 10.5 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని జీటీఆర్‌ఐ నివేదిక తెలిపింది. ఇదే స్థాయిలో వృద్ధి కొనసాగితే 2030 మార్చి నాటికి సేవల ఎగుమతులు 618.21 బిలియన్ డాలర్లకు, వస్తు ఎగుమతులు 613 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా కట్టింది.
ఐటీ, సాఫ్ట్‌వేర్, ఓబీఎస్ హవా..
భారత సేవల రంగం వృద్ధిలో అధిక భాగం సాఫ్ట్‌వేర్, ఐటీ సేవలు, ఇతర వ్యాపార సేవల (ఓబీఎస్) నుంచే ఉంటోందని.. 2023–24 ఎగుమతుల్లో వీటి వాటా 86.4 శాతంగా ఉన్నట్టు జీటీఆర్‌ఐ తెలిపింది. ఓబీఎస్ పరిధిలోని న్యాయ సేవలు, అకౌంటింగ్, పన్ను సంబంధిత సేవలు, మేనేజ్‌మెంట్ కన్సలి్టంగ్, మార్కెట్ పరిశోధన కలిపి 2023–24లో 10.28 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదైనట్టు జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.
మొత్తం సేవలు ఎగుమతుల్లో ఓబీఎస్ వాటా 33.2 శాతంగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో అత్యంత నైపుణ్య మానన వనరులు, అభివృద్ధి చెందుతున్న ఐటీ సదుపాయాలు అంతర్జాతీయ సేవల కేంద్రంగా భారత్ ప్రతిష్టను పెంచుతున్నట్టు జీటీఆర్‌ఐ తెలిపింది. జెనరేటివ్ ఏఐ, మెషిన్ లెరి్నంగ్(ఎంఎల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) భారత కంపెనీల అవకాశాలను అధికం చేస్తున్నట్టు పేర్కొంది. ‘‘సాఫ్ట్‌వేర్, ఐటీ సేవలు అతిపెద్ద విభాగంగా ఉండగా, వృద్ధిలో ఈ విభాగాన్ని ఓబీఎస్ దాటిపోనుంది. ప్రత్యేకమైన సేవలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది’’అని శ్రీవాస్తవ తెలిపారు.
యూఎస్ వెలుపల ఐటీ సేవల విస్తరణ..
యూఎస్‌కు బయట ఐటీ ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం మొదట చేయాల్సిన పనిగా జీటీఆర్‌ఐ పేర్కొంది. దేశ ఐటీ ఎగుమతుల్లో 70 శాతం యూఎస్‌కే వెళుతున్న నేపథ్యంలో, అక్కడి విధానాల్లో మార్పుల రిస్క్ ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. ‘‘ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఔట్‌సోర్స్‌ను విమర్శించడం, హెచ్–1బి వీసా పాలసీల కట్టడి తదితర విధానాలు ఈ రిస్‌్కలను గుర్తు చేస్తున్నాయి.
ఆటోమేషన్, కృత్రిమ మేథ (ఏఐ) 40 శాతం మేర ఐటీ ఉద్యోగులకు ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది’’అని శ్రీవాస్తవ తెలిపారు. ఇతర మార్కెట్లకు విస్తరించడం, డిజిటల్ పరివర్తిన, ఏఐ ఇంటెగ్రేషన్ యూఎస్‌పై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు. ఓబీఎస్ ఎగుమతులను ప్రోత్సహించాలని జీటీఆర్‌ఐ నివేదిక సూచించింది. ఈ విభాగంలో ఎగుమతులకు గణనీయమైన అవకాశాలున్నప్పటికీ, భారత సంస్థలు పూర్తి స్థాయిలో వినియోగంచుకోవడం లేదని పేర్కొంది. ఇంజనీరింగ్, పరిశోధన, మేనేజ్‌మెంట్ నిపుణులకు అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలపై అవగాహన పెరిగితే వృద్ధి అవకాశాలను మరింత ఇతోధికం చేసుకోవచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment