సాక్షి, బిజినెస్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో దుమ్మురేపి దేశాన్ని మరోసారి జగజ్జేతగా నిలిపింది ‘మెన్ ఇన్ బ్లూ’ టీమ్. ‘హిట్’మ్యాన్ రోహిత్ కెప్టెన్సీ.. కింగ్ కోహ్లీ మెరుపులకు బుమ్రా మ్యాజిక్.. పాండ్యా పంచ్.. మొత్తం టీమిండియా పోరాటపటిమ తోడవ్వడంతో కప్పు మన వశమైంది. బ్యాట్, బాల్‌తో చెలరేగిపోయే మన క్రికెట్ ధీరులు.. వ్యాపారవేత్తలుగా కూడా పవర్‌ఫుల్ ఇన్నింగ్స్‌తో అదరగొడుతున్నారు. ఒక పక్క క్రికెట్‌లో మునిగితేలుతూనే.. స్టార్టప్‌లలోనూ స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తూ పర్ఫెక్ట్ కవర్ డ్రైవ్‌లతో అలరిస్తున్నారు.
స్టార్టప్ పిచ్‌పై మార్కెట్ డిమాండ్లు, నవ కల్పనల వంటి దూసుకొచ్చే బంతులను మన ఎంట్రప్రెన్యూర్ బ్యాట్స్‌మెన్ దీటుగా ఎదుర్కొంటున్నారు. క్రికెటర్లు స్టార్టప్స్‌లో ఫైనాన్షియల్ సిక్సర్ కొట్టినా.. కొత్త వెంచర్‌లను లాంచ్ చేసినా గ్యాలరీలో కూర్చున్న అభిమానులకు ఈ బిజినెస్ గేమ్ కూడా థ్రిల్ అందిస్తోంది. సరైన పార్ట్ట్‌నర్‌షిప్ కుదిరితే స్టార్టప్ కాస్తా ‘యూనికార్న్’గా మారి.. అద్భుతమైన విజయం సాకారం కావచ్చు! ఎంట్రప్రెన్యూర్లుగా మారి సత్తా చాటుతున్న క్రికెటర్ల సంగతేంటో చూద్దాం...
కోహ్లీ.. ఇన్వెస్ట్‌మెంట్ ‘కింగ్’
స్పోర్ట్ కాన్వో: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రేమికులను కనెక్ట్ చేస్తోంది. కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన ఈ సంస్థ ఆన్‌లైన్ స్పోర్ట్స్ కమ్యూనిటీ ఏర్పాటుపై దృష్టి సారించింది.
స్టెపాథ్లాన్ లైఫ్‌స్టయిల్స్: పిల్లల ఆరోగ్య సంరక్షణ, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన సంస్థ ఇది. నవతరానికి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చేందుకు కోహ్లి కృషి చేస్తున్నారు.
పెట్టుబడుల్లోనూ ‘మిస్టర్ కూల్’..
7ఇంక్‌బ్రూస్: గ్రౌండ్‌లో కూల్ కెప్టెన్‌గా, ప్రత్యర్థులకు సెగలు పుట్టించే ధోనీ.. ఈ ఆహార పానీయాల స్టార్టప్‌తో ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మూడు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో లాభాల పరుగులు పారిస్తున్నారు.
ఖాతాబుక్: చిన్న మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ)కు అకౌంట్ల నిర్వహణను సులభతరం చేస్తున్న డిజిటల్ లెడ్జర్ యాప్ ఇది. దీనిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చిన్న వ్యాపారాలకు దన్నుగా నిలుస్తున్నారు.
క్లియర్‌ట్రిప్: ఈ ట్రావెల్ సంస్థకు ధోనీ బ్రాండ్ అంబాసిడర్. ట్రావెల్ ఆప్షన్లను ప్రమోట్ చే స్తూ, ప్రయాణికుల్లో విశ్వాసం నింపుతున్నారు.
యువరాజ్... ‘గేమ్’ఛేంజర్
యువరాజ్ సింగ్ ఫౌండేషన్ (యూవుయ్‌కెన్): హెల్తియాన్స్, ఎడ్యుకార్ట్.కామ్ వంటి ఆరోగ్య, విద్యా సంబంధ స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేస్తోంది. నవకల్పనలను ప్రోత్స హిస్తున్న యువరాజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతున్నారు.
గంభీర్... ఈకామర్స్ చాంపియన్
ఫైండ్ కామర్స్ ప్లాట్‌ఫామ్: డిజిటల్ రిటైల్ సొల్యూషన్లను అందించడం ద్వారా ఆన్‌లైన్ వ్యాపారంలోకి ప్రవేశించే వారికి దన్నుగా నిలుస్తోంది. దీంతో ఆఫ్–ఫీల్డ్‌లోనూ సాటిలేదని గౌతమ్ నిరూపించుకుంటున్నారు.
హార్దిక్.. కొత్త ‘అడుగులు’
అరెటో: చిన్న పిల్లలకు వారికి తగిన సైజుల్లో ఫుట్‌వేర్‌ను అందిస్తున్న వినూత్న సంస్థ ఇది. పాండ్యా పెట్టుబడితో పరిశ్రమలో కొత్త అడుగులు పడ్డాయి.
యూ ఫుడ్‌ల్యాబ్స్: రెడీ– టు–ఈట్ మీల్స్‌లో ప్రత్యేకతను చాటుకుంటున్న డీ2సీ (డైరెక్ట్–టు–కస్టమర్) ఫుడ్ స్టార్టప్. ఇన్వెస్టర్‌గా, బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ దన్నుగా నిలుస్తున్నారు.
రహానే.. ఫ్యాన్స్‌తో ‘కనెక్ట్’
ఫ్యాన్‌కైండ్: స్వచ్ఛంద సేవల కోసం సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌ను కనెక్ట్ చేస్తోంది. దాతృత్వం, ప్రజలతో మమేకం అయ్యేందుకు రహానే ఇందులో పెట్టుబడి పెట్టారు.
కేఎల్ రాహుల్.. ఫిట్‌నెస్ స్ట్రోక్
హ్యుగాలైఫ్: ఫిట్‌నెస్ ప్రియుల కోసం ఆన్‌లైన్‌లో అత్యుత్తమ న్యూట్రిషన్ సప్లిమెంట్ ఉత్పత్తులను అందిస్తోంది. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌తో కలిసి టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ ఈ స్టార్టప్‌ను నెలకొల్పారు.
సచిన్.. ‘మాస్టర్’ ఇన్వెస్టర్
స్మాష్: స్పోర్ట్స్, వర్చువల్ రియాలిటీ (వీఆర్), గేమింగ్‌ను కలగలిపి అందిస్తున్న స్టార్టప్ ఇది. సచిన్ పెట్టుబడి ఈ సంస్థను మాస్టర్ బ్లాస్టర్‌గా నిలుపుతోంది.
ముసాఫిర్: పర్యాటకులకు మంచి ట్రావెల్ అనుభూతిని కల్పించడమే లక్ష్యంగా ఇది ఏర్పాటైంది. ట్రావెల్ పరిశ్రమపై టెండూల్కర్ మక్కువను ఈ ఇన్వెస్ట్‌మెంట్ చాటిచెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment