న్యూఢిల్లీ: దేశీయంగా 30 శాతం మంది ఉద్యోగులు తాము పనిచేస్తున్న కంపెనీ నుంచి మారడానికే ఆసక్తి చూపుతున్నట్లు పీడబ్ల్యూసీ ఇండియా పేర్కొంది. ఇక 71 శాతం మంది అయితే ఉద్యోగ గమనంలో ఉపేక్షకు గురవుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో గత రెండేళ్లుగా దేశీ ఉపాధి రంగంలో అటు ఉద్యోగులు, ఇటు యాజమాన్యాల ఆలోచనా ధోరణి మార్పులకు లోనైనట్లు నివేదిక వివరించింది.
‘వర్క్‌ఫోర్స్ భయాలు, ఆశలు– 2022’ పేరిట పీడబ్ల్యూసీ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం యాజమాన్యాలు(ఎంప్లాయర్స్) నిలకడైన మానవవనరుల ఏర్పాటు వ్యూహాలపైనే దృష్టి పెడుతున్నాయి. ఇక ఉద్యోగులైతే ఆర్థిక అండతోపాటు.. అవకాశాలు, నూతన కల్పనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సర్వేలో 2,608 మంది ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో 93 శాతం మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులుకావడం గమనార్హం!
19 శాతమే
దేశీయంగా సర్వేలో పాల్గొన్న 34 శాతంమంది కొత్త కంపెనీకి మారేందుకు అత్యంత ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 19 శాతమే. కాగా.. దేశీయంగా మరో 32 శాతం మంది ప్రస్తుత కంపెనీని వీడే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. మిల్లీనియల్స్‌లో అత్యధిక శాతం మంది కొత్త ఉపాధి కోసం ఉత్సాహం చూపుతున్నారు.
రానున్న 12 నెలల్లోగా కంపెనీ మారే సన్నాహాల్లో ఉన్నట్లు తెలియజేశారు. జెన్ జెడ్ ఉద్యోగులలో కంపెనీ మారేందుకు విముఖత చూపారు. అయితే పని గంటల తగ్గింపునకు డిమాండ్ చేయడం ప్రస్తావించదగ్గ విషయం!! సర్వేలో సగంమంది ఉద్యోగులు అవకాశాలలేమిపై విచారం వ్యక్తం చేశారు. ఇదేవిధంగా సహచరుల నుంచి నైపుణ్యాలను నేర్చుకునే విషయంపై పెదవి విరిచారు.
Comments
Please login to add a commentAdd a comment