న్యూఢిల్లీ: అమెరికా, యూరప్ తదితర దేశాలకు వెళ్లే భారతీయ విమాన ప్రయాణికులు ఇన్‌డైరెక్ట్ ఫ్లయిట్ల కన్నా నాన్–స్టాప్, డైరెక్ట్ ఫ్లయిట్లకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ ట్రావెల్ డేటా సంస్థ ఓఏజీ గణాంకాల ప్రకారం గత కొన్నాళ్లుగా ఈ ధోరణి పెరుగుతోంది.
2023లో 3.72 కోట్ల మంది ప్యాసింజర్లు నాన్–స్టాప్ ఫ్లయిట్స్‌లో ప్రయాణించారు. కోవిడ్ పూర్వం 2019తో పోలిస్తే ఇది ఇరవై లక్షలు అధికం. ఇదే వ్యవధిలో ఒకటి లేదా అంతకు మించి స్టాప్స్‌లో ఆగుతూ వెళ్లే ఇన్‌డైరెక్ట్ ఫ్లయిట్స్‌లో ప్రయాణించిన వారి సంఖ్య 25 లక్షలు తగ్గి 2023లో 2.74 కోట్లకు పరిమితమైంది. 2023లో ప్రయాణించిన మొత్తం 6.46 కోట్ల మంది ప్యాసింజర్లలో 57 శాతం మంది నాన్–స్టాప్ ఫ్లయిట్స్‌నే ఎంచుకున్నారు. 2019లో ఇది 53 శాతంగా ఉంది.
పశ్చిమాసియా హబ్‌లకు తగ్గిన ప్రయాణికులు అమెరికా, యూరప్‌లకు వెళ్లే ఫ్లయిట్స్ కోసం భారతీయులు ఎక్కువగా పశ్చిమాసియా హబ్‌ల వైపు మొగ్గు చూపే ధోరణి తగ్గింది. ఓఏజీ గణాంకాల ప్రకారం 2019–2023 మధ్య కాలంలో పశ్చిమాసియా హబ్‌లకు ప్యాసింజర్ల సంఖ్య 10 లక్షల మేర తగ్గింది. ఆ నాలుగేళ్ల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ఇతర హబ్‌లకు కూడా ప్రయాణికుల సంఖ్య 28 లక్షల మేర తగ్గింది. మరోవైపు, కొత్తగా 52 అంతర్జాతీయ రూట్లను జోడించడంతో ఇన్‌డైరెక్ట్ ఫ్లయిట్ ప్యాసింజర్లకు సంబంధించి దేశీ హబ్‌లలో ప్రయాణికుల సంఖ్య 10 లక్షల మేర పెరిగింది.
ఓఏజీ విశ్లేషణ ప్రకారం గల్ఫ్ దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) 36 లక్షల మంది, సౌదీ అరేబియాలో 26 లక్షల మంది ఉన్నారు. ఇంటర్నేషనల్ రూట్లలో భారతీయులను గమ్యస్థానాలకు చేరవేయడంలో పశ్చిమాసియా దేశాల ఎయిర్‌లైన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ విషయంలో దశాబ్దం క్రితం గల్ఫ్ దేశాల ఎయిర్‌లైన్స్ వాటా 48 శాతంగా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇది 50 శాతానికి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment