దేశ రిటైల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత పెట్టుబడులు (ఇనిస్టిట్యూషన్స్ ఇన్వెస్ట్‌మెంట్స్) గతేడాది అరు రెట్లు వృద్ధి చెంది 492 మిలియన్ డాలర్లుగా (రూ.4034 కోట్లు) నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రభావం అనంతరం రిటైల్ వ్యాపారాలు పుంజుకోవడాన్ని కొలియర్స్ ఇండియా ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. 2021లో రిటైల్ రియల్ ఎస్టేట్‌లోకి 77 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడం గమనించాలి. 2020, 2021లో కరోనా ఉధృతంగా ఉండడం పెట్టుబడులపై ప్రభావం చూపించింది.
ఇక భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి సంస్థాగత పెట్టుబడులు 2022లో 20 శాతం పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు ఏడాదిలో ఇవి 4.08 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. డేటా కేంద్రాలు, సీనియర్ హౌసింగ్, హాలీడే హోమ్స్ తదితర ఆల్టర్నేటివ్ రియల్ ఎస్టేట్‌లోకి గతేడాది 867 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 2021లో వచ్చిన 453 మిలియన్ డాలర్ల కంటే 92 శాతం పెరిగాయి. సంప్రదాయ సాధనాలతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇచ్చే ప్రత్యామ్నాయ సాధనాల వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రత్యామ్నాయ పెట్టుబడుల్లో 52 శాతం డేటా సెంటర్స్ ఆకర్షించాయి.
ఆఫీస్ మార్కెట్లోకి 41 శాతం
ఇక గతేడాది మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో 41 శాతం ఆఫీస్ స్పేస్ విభాగంలోకి వచ్చాయి. అంటే 1.9 బిలియన్ డాలర్లను ఆఫీస్ స్పేస్ విభాగం ఆకర్షించింది. అంతకుముందు ఏడాది ఇదే విభాగంలో పెట్టుబడులు 1.32 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మిశ్రమ వినియోగ ప్రాజెక్టుల్లోకి రెట్టింపునకు పైగా పెరిగి 464 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ ఆస్తుల్లోకి 63 శాతం తక్కువగా 422 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
అంతకుముందు ఏడాది ఈ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు 1,130 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నివాస ప్రాజెక్టుల్లోకి సైతం 29 శాతం తక్కువగా 656 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ‘‘భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి పెట్టుబడులు గత కొన్నేళ్ల నుంచి స్థిరంగా వస్తున్నాయి. నిర్మాణాత్మక వచ్చిన మార్పుతో ఈ మార్కెట్ ఇంకా వృద్ధి చెందుతుంది’’అని కొలియర్స్‌ఇండియా తన నివేదికలో పేర్కొంది.
చదవండి: ఆర్ధిక మాంద్యం భయాలు.. ఆఫీసుల్ని ఖాళీ చేస్తున్న మెటా, మైక్రోసాఫ్ట్!
Comments
Please login to add a commentAdd a comment