బ్యాంకింగ్ వ్యవస్థలో ఇప్పుడు డిపాజిట్ల పోరు మొదలైంది. రుణాలు ఇస్తున్నంత జోరుగా డిపాజిట్ల సమీకరణ జరగడం లేదంటూ ఆర్‌బీఐ పదేపదే హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల మోత మోగుతోంది. అధిక వడ్డీ రేట్ల రేసులో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ముందుండటం గమనార్హం!
డిపాజిట్ల సమీకరణలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీలు) దూసుకెళ్తున్నాయి. దాదాపు అరడజను ఎస్‌ఎఫ్‌బీలు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై 8% శాతం పైగా వడ్డీరేటును ఆఫర్ చేస్తూ డిపాజిటర్లను ఆకర్షిస్తున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి బడా బ్యాంకులు, ఇతర వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే ఏకంగా 1 శాతం పైగానే అధికంగా వడ్డీరేటును ఆఫర్ చేస్తుండటం గమనార్హం. గత కొన్నేళ్లుగా డిపాజిట్ రేట్లు నేలచూపులు చూడటంతో పాటు షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లు, బాండ్లు ఇతరత్రా ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశాలు ఆకర్షించడంతో ఇన్వెస్టర్లు తమ పొదుపు నిధులను చాలా వరకు అటువైపు మళ్లిస్తున్నారు. దీంతో కొంతకాలంగా బ్యాంకుల్లో డిపాజిట్లు వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై ఆర్‌బీఐ తీవ్రంగా దృష్టి పెట్టడంతో బ్యాంకులు మళ్లీ రేట్ల పెంపు, ప్రత్యేక స్కీమ్‌ల ద్వారా డిపాజిట్ల సమీకరణ వేట మొదలు పెట్టాయి.
ఇదీ చదవండి: ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోం’
జులై నుంచి జోరు...
ఈ ఏడాది జూన్‌లో డిపాజిట్లు, రుణ వృద్ధి మధ్య అంతరం ఆల్‌టైమ్ గరిష్టానికి ఎగబాకడంతో రేట్ల పెంపు మొదలైంది. బ్యాంకులన్నీ వరుస కట్టడంతో జులై నుంచి ఇది వేగం పుంజుకుంది. ఈ రేసులో ఎస్‌ఎఫ్‌బీలు బ్యాంకులతో పోటాపోటీగా వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఉత్కర్ష్, సూర్యోదయ ఎస్‌ఎఫ్‌బీలు 2–3 ఏళ్ల వ్యవధి ఫిక్సిడ్ డిపాజిట్లపై 8.5% వడ్డీని ఇస్తున్నాయి. ఈక్విటాస్ కూడా రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఎఫ్‌డీలపై 8.5% వడ్డీరేటును అందిస్తోంది. యూనిటీ ఎస్‌ఎఫ్‌బీ అయితే 1,001 రోజుల ఎఫ్‌డీపై ఏకంగా 9% వడ్డీ ఇస్తుండటం విశేషం. ఈ విషయంలో వాణిజ్య బ్యాంకులు వెనుకబడుతున్నాయి. ఎస్‌బీఐ 444 రోజుల ప్రత్యేక డిపాజిట్ స్కీమ్‌పై అత్యధికంగా 7.25% వడ్డీ ఆఫర్ చేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గరిష్ట డిపాజిట్ రేటు 7.4%. అయితే, ఈ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అదనంగా అర శాతం వడ్డీ ఇస్తున్నాయి. కాగా, బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) కూడా 8% పైగా వడ్డీ ఆఫర్ చేస్తూ బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. మణిపాల్ హౌసింగ్ ఫైనాన్స్ 1–3 ఏళ్ల ఎఫ్‌డీలపై 8.25% వడ్డీ ఇస్తుండగా.. బజాజ్ ఫైనాన్స్ 42 నెలల డిపాజిట్‌కు 8.65% వడ్డీ రేటు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment