ఎఫ్‌డీ...ఎక్కడ చేద్దాం! | Fixed Deposit Rate Of Interest | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీ...ఎక్కడ చేద్దాం!

Published Mon, Jul 31 2017 12:14 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

ఎఫ్‌డీ...ఎక్కడ చేద్దాం! - Sakshi

ఎఫ్‌డీ...ఎక్కడ చేద్దాం!

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో అధిక రేటు
ఒకటి నుంచి రెండు శాతం వరకు ఎక్కువ
దీర్ఘకాలంలో రాబడుల్లో తేడా బాగానే ఉంటుంది


సంప్రదాయ ఇన్వెస్టర్లకు రిస్క్‌ అంటే ఏ మాత్రం సహించదు. ఎంతసేపటికీ భద్రతకే వారి పెద్దపీట. అదే సమయంలో భద్రతతో కూడిన మెరుగైన రాబడుల కోసం చూస్తుంటారు. ఈ తరహా ఇన్వెస్టర్లు సాధారణ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌  డిపాజిట్లు చేయటానికి బదులు... స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల పేరుతో ఇటీవల కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బ్యాంకుల్ని పరిశీలించొచ్చు. ఇవి కొంచెం ఎక్కువ వడ్డీ రేటునే ఆఫర్‌ చేస్తున్నాయి.ప్రస్తుతం ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)లపై వడ్డీ రేటు ఏడాది మించితే 7 శాతాన్ని దాటడం లేదు.

 మూడేళ్లు దాటిన కాల వ్యవధిగల డిపాజిట్లపై 7 శాతం కూడా ఆఫర్‌ చేయడం లేదు. కానీ, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో వడ్డీ రేటు కాస్త ఎక్కువే ఉంది. ఇవి 9 శాతం వరకు వడ్డీ రేటు ఆఫర్‌ చేస్తున్నాయి. కొత్తగా వచ్చిన బ్యాంకులు కావడంతో ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కొంచెం అదనంగా వడ్డీని అందిస్తున్నాయి. అయినప్పటికీ ఇవి రిజర్వ్‌ బ్యాంకు అడుగుజాడల్లోనే నడవాల్సి ఉంటుంది. కాబట్టి భద్రత విషయంలో అంత భయమేమీ అక్కర్లేదు. రిస్క్‌ తీసుకోకుండా... బ్యాంకుల్లోనే ఉంచుకోవాలని ఆశించే వారికి ఇవి తగినవే.

ఉదాహరణకు రూ.లక్షను పదేళ్ల కాలానికి డిపాజిట్‌ చేద్దామనుకుంటే... 9 శాతం వడ్డీ రేటుపై ఇన్వెస్ట్‌ చేస్తే 10 ఏళ్ల తర్వాత అది రూ.2.45 లక్షలు అవుతుంది. అంటే రూ.1.45 లక్షల మేర వృద్ధి చెందుతుంది. అదే రూ.లక్షను తీసుకెళ్లి 6.9 శాతం వడ్డీ రేటుకు ఏ ప్రభుత్వ బ్యాంకో లేదా ప్రైవేటు బ్యాంకులోనో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. అప్పుడు పదేళ్ల తర్వాత ఆ మొత్తం రూ.2 లక్షలు అవుతుంది. వడ్డీ రేటు అధికంగా ఉండటం వల్ల స్మాల్‌ బ్యాంకులో ఎఫ్‌డీ ద్వారా రూ.45 వేలను అధికంగా పొందే అవకాశం ఇక్కడ ఉంది.

గమనించాల్సిన అంశాలివీ...
ఎఫ్‌డీ చేసే ముందు ఎంత కాలానికి చేస్తున్నారు? ఏ కాలానికి, ఎంత వడ్డీ రేటు అమల్లో ఉంది? అనే విషయాలను వివరంగా అడిగి తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా సెక్షన్‌ 80సీ కింద ఆదాయ పన్ను ప్రయోజనం పొందేందుకు ఇన్వెస్ట్‌ చేస్తుంటే ఐదేళ్లకు తక్కువ కాకుండా ఉండాలి. ఐదేళ్ల లోపు డిపాజిట్లకు ఈ పన్ను మినహాయింపు లేదు. ఇక ఎఫ్‌డీలపై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.10వేలు మించితే టీడీఎస్‌ విధిస్తారన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఉపసంహరణ సమయంలో వచ్చే ఆదాయం మీ మొత్తం ఆదాయంలో కలుస్తుంది.

 పన్ను పరిధిలో ఉంటే ఆ రేటు ప్రకారం టీడీఎస్‌ విధిస్తారు. పన్ను పడే ఆదాయం లేకుంటే 60 ఏళ్లలోపు వారు ఫామ్‌ 15జీ, ఆపైన వయసున్న వారు ఫామ్‌ 15హెచ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో చేసే చిన్న డిపాజిట్లకు హామీ ఉంటుంది. అంటే రూ.లక్ష వరకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ కింద బ్యాంకులు చెల్లించడంలో చేతులు ఎత్తేసినా ఆ మేరకు ఖాతాదారులకు డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. ఒకవేళ బ్యాంకుల్లో కాకుండా కంపెనీల ఎఫ్‌డీ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసేట్టు అయితే ఆయా కంపెనీల గత కాలపు పనితీరు, గుర్తింపును పరిశీలించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement