చరిత్రలో మనకంటూ ఒక స్పేస్ | International Day of Human Space Flight Special Story | Sakshi
Sakshi News home page

చరిత్రలో మనకంటూ ఒక స్పేస్

Published Mon, Apr 12 2021 2:37 PM | Last Updated on Mon, Apr 12 2021 5:05 PM

International Day of Human Space Flight Special Story - Sakshi

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌: భూమికి అవతల ఏముంది.. ఇతర గ్రహాల్లో, ఇంకెక్కడైనా జీవం ఉందా.. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తోక చుక్కలు.. ఇలా అంతరిక్షంపై ఎప్పటినుంచో మనిషికి ఆసక్తి ఉంది. ఆ దిశగానే అంతరిక్ష ప్రయోగాలు చేపట్టారు. మనుషులు స్పేస్‌లోకి అడుగు పెట్టారు కూడా. 1961 ఏప్రిల్‌ 12న రష్యా కాస్మోనాట్‌ యూరీ గగారిన్‌ తొలిసారిగా స్పేస్‌లోకి వెళ్లారు. ఈ మేరకు ఏటా ఏప్రిల్‌ 12న ‘ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ డే’గా జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది చేపట్టిన పలు కీలక అంతరిక్ష ప్రయోగాలేంటో తెలుసుకుందామా?   
    
అమెరికా.. ఆర్టెమిస్‌-1 
చంద్రుడిపైకి మనుషులను పంపే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్‌ మిషన్‌లో భాగంగా ఈ ఏడాది తొలి ప్రయోగం జరుగనుంది. నవంబర్‌లో ‘ఆర్టెమిస్‌-1’ను లాంచ్‌ చేసేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. 

ది జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ 
సుదూర అంతరిక్షంలో రహస్యాలను ఛేదించేందుకు, భూమిలాంటి గ్రహాలను గుర్తించేందుకు నాసా చేపట్టిన ‘ది జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌’ ఈ ఏడాది అక్టోబర్‌లో నింగికి ఎగరనుంది. 

మార్స్‌పైకి.. మూడు దేశాలు 
ఒకప్పుడు జీవం ఉండి ఉంటుందని భావిస్తున్న అంగారక గ్రహంపై ఈ ఏడాది మూడు దేశాలు పరిశోధనలు చేపట్టాయి. అమెరికా పంపిన పర్సవెరన్స్‌ రోవర్‌ మార్స్‌పై ఉపరితలంపై తిరుగుతూ అక్కడి నేల, రసాయనాలు, జీవం ఉనికిని వెతుకుతోంది. ఈ రోవర్‌ వెంట వెళ్లిన ‘ఇన్‌జెన్యుటీ’.. భూమి అవతల మరోగ్రహంపై గాల్లోకి ఎగిరే తొలి హెలికాప్టర్‌ కానుంది. ఇక మార్స్‌పైకి చైనా, యూఏఈ దేశాలు తొలిసారి ప్రయోగాలు చేపట్టాయి. చైనాకు చెందిన టియాన్వెన్‌-1, యూఏఈకి చెందిన ది హోప్‌ ఆర్బిటర్‌ రెండూ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం ఒక్క రోజు తేడాలో అంగారకుడిని చేరి పరిశోధనలు మొదలుపెట్టాయి. 

స్పేస్‌లో చెత్తను క్లీన్‌ చేసేందుకు.. 
సుమారు 50 ఏళ్లుగా వివిధ దేశాలు పంపిన శాటిలైట్లలో గడువు ముగిసిపోయినవి, చెడిపోయినవి, ప్రయోగాలకు వాడిన రాకెట్లు, వాటి విడిభాగాలు లక్షల సంఖ్యలో భూమిచుట్టూ తిరుగుతున్నాయి. వాటినే ‘స్పేస్‌ జంక్‌’ అంటారు. ఇవి భవిష్యత్తు శాటిలైట్‌ ప్రయోగాలకు ప్రమాదకరం. ఈ నేపథ్యంలో ఆ చెత్తను క్లీన్‌ చేసేందుకు జపాన్‌కు చెందిన ఆస్ట్రోస్కేల్‌ కంపెనీ ఈ ఏడాది మార్చి 22న ‘స్పేస్‌ జంక్‌ క్లీనప్‌’ మిషన్‌ను ప్రయోగించింది. 

చంద్రయాన్‌-3 
చంద్రుడిపైకి రోవర్‌ను పంపేందుకు మన ఇస్రో చంద్రయాన్‌-3 ప్రాజెక్టును చేపట్టింది. దానిని ఈ ఏడాది చివర్లో ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రయోగం వాయిదా పడింది. దీనిని వచ్చే ఏడాది తొలి క్వార్టర్‌లో చేపట్టాలని భావిస్తోంది.  

ఆస్టరాయిడ్ల గుట్టు తేల్చే.. ల్యూసీ మిషన్‌ 
అంగారక గ్రహం అవతలి ఒక ఆస్టరాయిడ్, గురుగ్రహం కక్ష్యలో సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఏడు ‘ట్రోజాన్‌ ఆస్టరాయిడ్ల’పై పరిశోధన కోసం నాసా చేపట్టిన ప్రయోగం ‘ల్యూసీ’ మిషన్‌. సౌర కుటుంబం ఏర్పడిన తొలినాళ్లలో పరిస్థితులు, భూమిపై జీవం పుట్టుకకు సంబంధించిన ఆనవాళ్లను ఈ ప్రయోగంతో గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 12 ఏళ్లపాటు సాగు ఈ సుదీర్ఘ మిషన్‌ ఈ ఏడాది అక్టోబర్‌లో నింగికి ఎగరనుంది.

చదవండి: మార్స్‌పై బుల్లి హెలీకాప్టర్‌‌, దానికి పేరు పెట్టిందెవరో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement