ఐటీ పరిశ్రమలలో ప్రస్తుతం లేఆఫ్‌లు బెంబేలెస్తున్నాయి. కొత్త నియామకాలు తగ్గిపోయాయి.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. దీంతో తమ పరిస్థితి ఏంటని ఫ్రెషర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో వారు ఎగిరి గంతేసే ఓ నివేదిక వెల్లడైంది.
టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ కెరీర్ ఔట్‌లుక్ రిపోర్ట్ 2024 ప్రకారం.. ప్రముఖ ఐటీ దిగ్గజాలు రాబోయే ఆరు నెలల్లో 40,000 మందికి పైగా ఫ్రెషర్‌లను నియమించుకునే ప్రణాళికలో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ ఐటీ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తోందని రిక్రూట్‌మెంట్ సంస్థ టీమ్‌లీజ్ డిజిటల్ విశ్లేషిస్తోంది.
"జెనరేటివ్ ఏఐ ఆటోమేషన్‌కు అనుగుణంగా వర్క్‌ఫ్లో మారబోతోంది. ఈ ఏఐ సిస్టమ్‌లతో సమర్థవంతంగా సహకరించడానికి ఫ్రెషర్లు సిద్ధంగా ఉండాలి" అని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ సీవోవో జైదీప్ కేవల్రమణి పేర్కొన్నారు. "ఎంప్లాయర్లు కొంతకాలంగా సంప్రదాయవాద అడుగులు వేశారు. ప్రపంచ గందరగోళాల మధ్య నియామకం మందగించింది. అయితే మా ఇటీవలి సర్వే భారతదేశ వృద్ధి కథనంపై ఎంప్లాయర్ విశ్వాసాన్ని వెల్లడిస్తుంది. సంస్థలు తమ భవిష్యత్తు మార్గాలపై మరింత నమ్మకంగా ఉన్నాయి" టీమ్‌లీజ్ వ్యవస్థాపకుడు, సీఈవో ఎడ్‌టెక్ శంతను రూజ్ తెలిపారు.
గతేడాది కంటే తక్కువే..
ఐటీ రంగంలో ఫ్రెషర్‌ల నియామకం ఉద్దేశం 2024 తొలి ఆర్నెళ్లలో 42 శాతానికి తగ్గింది. 2023లో ఇదే కాలంలో ఇది 49 శాతంగా ఉండేది. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ప్రొఫెషనల్స్ కోసం నియామక ఉద్దేశం గత ఏడాది ఇదే కాలంలో 62 శాతం నుంచి ప్రస్తుత ప్రథమార్ధంలో (జనవరి-జూన్ 2024) అన్ని రంగాలలో 68 శాతానికి స్వల్పంగా మెరుగుపడిందని నివేదిక పేర్కొంది.
ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం ప్రథమార్ధంలో ఫ్రెషర్‌లను నియమించుకునే అవకాశం ఉన్న మొదటి మూడు పరిశ్రమలు ఈ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు (55%), ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (53%), టెలికమ్యూనికేషన్స్ (50%) అని నివేదిక విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment