ముంబై: భారతీయ ఐటీ నిపుణులకు ఈ ఏడాది బాగా కలిసి వస్తోంది. టాప్ ఐటీ అండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచనున్నాయిట. గత కొన్ని త్రైమాసికాల్లో అట్రిషన్ రేటు భారీగా ఉండటంతో, ఉద్యోగులను, ముఖ్యంగా ఐటీ నిపుణులను నిలుపుకునేందుకు తంటాలు పడుతున్నాయి. ఏకంగా 70 నుంచి 120 శాతం దాకా తమ ఉద్యోగులను జీతాలను పెంచేందుకు నిర్ణయించాయి.
ఈ నేపథ్యంలో అనేక ఐటీ కంపెనీలు వేతనాల పెంపు, బోనస్ చెల్లింపుల లాంటి బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇప్పటికేచ చాలా కంపెనీల్లో జాయినింగ్ బోనస్ ను భారీ ఎత్తునే ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లాంటి దిగ్గజాలతో పాటు ఇతర టాప్ కంపెనీలున్నాయి.
వ్యాపారాలు జీతాలు పెంచడం, బోనస్ సహా, ఇతర ప్రయోజనాలను అందించడం ద్వారా తమ ఉద్యోగులను నిలుపుకునేందుకు చూస్తున్నాయని మింట్ రిపోర్ట్ చేసింది. ఈ సమస్యలకు తోడు, సంస్థలో జీతాల పెంపు ఉండదనే వదంతుల నేపథ్యంలో ఈ సెప్టెంబరులోనే జీతాల పెంపు యథాతథంగా ఉంటుందని విప్రో స్పష్టం చేసింది. అంతేకాదు బెస్ట్ ఉద్యోగులకు మిడ్-మేనేజ్‌మెంట్ స్థాయిలో ప్రమోషన్లను కూడా ఇవ్వనుంది.
ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్‌లో కూడా అట్రిషన్ రేటు ఎక్కువగానే ఉంది. ఇది కంపెనీ స్వల్పకాలిక లాభదాయకతపై ప్రభావంచూపుతుంది. జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో అట్రిషన్ రేటు 27.7శాతం నుండి 28.4 శాతానికి పెరిగింది. దీన్నిగణనీయంగా తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. హైరింగ్ అండ్ కాంపిటేటివ్ కాంపెన్సేటివ్ రివిజన్‌ల ద్వారా టాలెంట్‌లో వ్యూహాత్మక పెట్టుబడులతో బలమైన వృద్ధిని సాధించ నున్నామని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ వెల్లడించారు. ఇది తక్షణమే మార్జిన్‌లపై ప్రభావం చూపినప్పటికీ, ఇది అట్రిషన్ స్థాయిలను తగ్గించి, భవిష్యత్తు వృద్ధికి మంచి స్థానాన్ని ఇస్తుందన్నారు.
టీసీఎస్
దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ అధిక అట్రిషన్ రేటు 19.7గా ఉంది. దీన్ని తగ్గించుకునేందుకు 5 నుంచి 8 శాతం వేతనాల పెంపు అఫర్ చేస్తున్నామని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ప్రకటించారు. మంచి నైపుణ్యం కనబర్చిన వారికి వేతనం వృద్ధి మరింత ఉంటుందని ప్రకటించడం విశేషం. మిగిలిన టాప్ ఐటీ కంపెనీల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment