బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, అలీబాబా గ్రూప్ అధినేత జాక్‌మా రెండున్నర నెలల తర్వాత ఆన్‌లైన్ వీడియోలో ప్రత్యక్షమయ్యారు. 50 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోలో.. తన ఫౌండేషన్ మద్దతు పొందిన టీచర్లకు అభినందనలు తెలియజేశారు. తను రెండున్నర నెలలుగా కనిపించకుండా పోవడానికి, అలీబాబా గ్రూపుపై చైనా సర్కారు నియంత్రణ చర్యల గురించి మా ప్రస్తావించలేదు. ఈ వీడియో చైనా బిజినెస్ న్యూస్, ఇతర పోర్టళ్లలో దర్శనమిచ్చింది. ‘‘జనవరి 20న జరిగిన వార్షిక గ్రామీణ టీచర్ల ఆన్‌లైన్ కార్యక్రమంలో జాక్‌మా పాల్గొన్నారు’’అంటూ జాక్‌మా ఫౌండేషన్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 24న షాంఘై కాన్ఫరెన్స్ సందర్భంగా చైనా నియంత్రణ సంస్థలను జాక్‌మా విమర్శించారు. ఆవిష్కరణలను తొక్కి పెడుతున్నాయని ఆయన ఎత్తిచూపారు. తర్వాత కొన్ని రోజుల్లోనే జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూపు భారీ ఐపీవో ప్రయత్నాలను నియంత్రణ సంస్థలు సస్పెండ్ చేశాయి. వ్యాపార దిగ్గజంగా ఎదిగిన 56 ఏళ్ల జాక్‌మా ఆ తర్వాత నుంచి కనిపించకుండాపోవడంతో.. చైనా కమ్యూనిస్ట్ సర్కారు నిర్బంధించి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment