ఈ హైటెక్ యుగంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం జనాలకు అనివార్యం. స్మార్ట్‌ఫోన్‌లో అవసరమైన పనులకు సంబంధించినవే కాకుండా, నానారకాల అనవసరమైన యాప్‌లు, గేమ్‌లు కూడా ఉంటాయి. కుర్రకారు వీటికి అలవాటుపడి స్మార్ట్‌ఫోన్ బానిసలుగా మారుతున్నారు. పని ఉన్నా, లేకున్నా చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ను అదేపనిగా రుద్దుతూ, అందులోనే తలమునకలై వృథా కాలహరణం చేస్తూ చదువుసంధ్యలకు దూరం అవుతున్నారు.
ఇలాంటి పరిస్థితి నుంచి పిల్లలను తప్పించడానికి ఏదైనా విరుగుడు ఉంటే బాగుండునని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. స్మార్ట్‌ఫోన్ అడిక్షన్‌ను తేలికగా తప్పించే విరుగుడు అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది అదే! చూడటానికి స్మార్ట్‌ఫోన్‌కు వాచీ తొడిగినట్లు కనిపిస్తుంది కదూ! ఇది స్మార్ట్‌ఫోన్‌కు స్మార్ట్‌తాళం. జోవావో పెరీరా అనే పోర్చుగీస్ డిజైనర్ ఈ స్మార్ట్‌తాళాన్ని ‘డిస్‌కనెక్ట్’ పేరుతో రూపొందించాడు.
ఇందులోని టైమర్‌లో టైమ్ సెట్ చేసుకుని, స్మార్ట్‌ఫోన్‌కు దీనిని తొడిగితే చాలు, టైమర్‌లో మనం నిర్ణయించుకున్న సమయం పూర్తయ్యే వరకు ఫోన్ పనిచేయదు. ఒకవేళ ఏదైనా ముఖ్యమైన కాల్ లేదా ఈమెయిల్ లేదా మెసేజ్ వస్తే, మనం నిర్ణయించుకున్న ‘పిన్’ ద్వారా దీనిని అన్‌లాక్ చేసుకోవచ్చు. అయితే, ఇదింకా మార్కెట్‌లోకి రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment