
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆభరణాల సంస్థ కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా రూ. 69 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో కంపెనీ రూ. 136 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజాగా కోవిడ్–19 పరమైన ఆంక్షలు తగ్గడం, ఆర్థిక వ్యవస్థ రికవరీ తదితర అంశాలు అమ్మకాలకు ఊతమిచ్చినట్లు కంపెనీ తెలిపింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 1,798 కోట్ల నుంచి 61 శాతం ఎగిసి రూ. 2,889 కోట్లకు పెరిగింది. క్యూ2లో కంపెనీ పటిష్టమైన పనితీరు కనపర్చిందని, కోవిడ్–19పరమైన ఆంక్షలు సడలింపుతో పాటు వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడుతుండటంతో ప్రస్తుత త్రైమాసికంలో కూడా అమ్మకాలు మరింతగా వృద్ధి చెందవచ్చని కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ తెలిపారు.
బీఎస్‌ఈలో బుధవారం కంపెనీ షేరు సుమారు 4 శాతం పెరిగి రూ. 81.50 వద్ద క్లోజయ్యింది.