న్యూఢిల్లీ: టెక్నాలజీపై పెట్టుబడులు కంపెనీల పనితీరును ఇతోధికం చేస్తున్నట్టు ‘కేపీఎంజీ గ్లోబల్ టెక్ రిపోర్ట్ 2023’ తెలిపింది. టెక్నాలజీల సాయంతో కంపెనీలు తమ లాభాలను 10 శాతానికి పైగా పెంచుకోగలుగుతున్నట్టు, గతేడాది 2.5 శాతంతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్టు పేర్కొంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా, అనలైటిక్స్ తదితర అత్యాధునిక టెక్నాలజీ, టూల్స్‌పై కంపెనీల పెట్టుబడులు మూడు రెట్లు పెరిగినట్టు వెల్లడించింది.
కేపీఎంజీ ప్రపంచవ్యాప్తంగా 2,100 మంది టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌లను (కంపెనీలకు సంబంధించిన) సర్వే చేసి ఈ వివరాలను నివేదిక రూపంలో విడుదల చేసింది. కంపెనీలు డిజిటల్ పరివర్తనంలో భాగంగా అనుసరిస్తున్న టెక్నాలజీ వ్యూహాలను ఈ నివేదిక ఏటా తెలియజేస్తుంటుంది.
► ఏఐ, క్లౌడ్‌తో తమ పనితీరు, లాభదాయకత గణనీయంగా పెరిగినట్టు 63 శాతం మంది సర్వేలో తెలిపారు.
► వర్ధమాన టెక్నాలజీలను అందిపుచ్చుకునే ధోరణి గతేడాది ఉన్న 10 శాతం నుంచి 38 శాతానికి పెరిగింది.
► కంపెనీల లక్ష్యాల సాధనకు ఏఐ ఎంతో ముఖ్యమైన టెక్నాలజీగా అవతరించింది.
► టెక్నాలజీ వల్ల ఉద్యోగుల ఉత్పాదకత పెరిగినట్టు 72 శాతం మంది చెప్పారు.
► వచ్చే రెండేళ్లలో టెక్నాలజీ కార్యకలాపాల పరంగా ఈఎస్‌జీ ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళతామని 48 శాతం మంది చెప్పారు.
► వివిధ టెక్నాలజీ కార్యకలాపాల్లో సమన్వయం లేమి పురోగతికి అడ్డంకింగా నిపుణులు పేర్కొన్నారు.
►కస్టమర్ అనుభవం, ఈఎస్‌జీ, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ ఆవిష్కరణలకు కీలక చోదకాలుగా ఈ సర్వే పేర్కొంది.
► వచ్చే కొన్నేళ్లలో ఏఐపై మరింత దృష్టి సారించడం డిజిటల్ పరివర్తనానికి కీలకమని తెలిపింది.
► స్వల్పకాల వ్యాపార లక్ష్యాలకు ఏఐ, మెషిన్ లెర్నింగ్ తమకు ప్రాధాన్యమైనవిగా 68 శాతం మంది చెప్పారు. గతేడాది ఇలా చెప్పిన వారు 57 శాతంగా ఉన్నారు.
► టెక్నాలజీ అమలులో భద్రత కీలకమని ఈ సర్వే స్పష్టం చేసింది. ఆరంభ ప్రాజెక్టుల్లో రిస్క్ నిర్వహణ అనేది టెక్నాలజీ పరివర్తన కార్యక్రమాల విజయానికి కీలకమని 62 శాతం కంపెనీలు తెలిపాయి. భారత్‌లో అయితే ఇలా చెప్పిన కంపెనీలు 88గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment