న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేసులో తమను పార్టీగా చేర్చడాన్ని సవాలుచేస్తూ ఆడిటర్లు డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్, కేపీఎంజీ అనుబంధ విభాగం బీఎస్‌ఆర్ అండ్ అసోసియేట్స్ దాఖలు చేసిన పిటిషన్‌లను ఎన్‌సీఎల్‌ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్) బుధవారం కొట్టివేసింది. స్వతంత్ర డైరెక్టర్లు ఈ మేరకు దాఖలు చేసిన పిటీషన్‌నూ అప్పీలేట్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనుబంధ విభాగం ఐఎఫ్‌ఐఎన్‌లో మోసానికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ముంబై ద్విసభ్య ధర్మాసనం 2019 జూలై 23న ఇచ్చిన రూలింగ్‌ను సమర్థించింది.
కేసుకు సంబంధించి తమనూ యాజమాన్యంలో భాగంగా పరిగణించడం తగదని ఆడిటర్లు డెలాయిట్ హాస్కి న్స్ అండ్ సెల్స్, కేపీఎంజీ బీఎస్‌ఆర్ అండ్ అసోసియేట్స్ చేసిన వాదనలను అప్పీలేట్ అథారిటీ తిరస్కరించింది. ఈ కేసులో మాజీ ఆడిటర్లనూ పార్టీలుగా చేర్చి ఆస్తులనూ జప్తు చేయాలని ఎన్‌సీఎల్‌టీని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ కోరింది. దీనిని గత ఏడాది జూలై 23న ముంబై ధ ర్మాసనం ఆమోదించింది. అయితే ఈ తీర్పును ఆడిటర్లు, స్వతంత్ర డైరెక్టర్లు ఎన్‌సీఎల్‌ఏటీలో సవాలు చేశారు. జూలై 29న అప్పీలేట్ ట్రిబ్యునల్ కేసులో స్టే ఇస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ స్టేను మరో రెండు వారాలు పొడిగించాలన్న ఆడిటర్లు, స్వతంత్య్ర డైరెక్టర్ల తాజా విజ్ఞప్తిని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించడం తక్షణం ఆయా ఆడిటర్లు, స్వతంత్ర డైరెక్టర్లకు ఊరటనిచ్చే అంశం.
Comments
Please login to add a commentAdd a comment