ముంబై, సాక్షి: సుమారు మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రయివేట్ రంగ సంస్థ లక్ష్మీ విలాస్ బ్యాంకు(ఎల్‌వీబీ).. సింగపూర్ ప్రభుత్వ అనుబంధ సంస్థ డీబీఎస్ బ్యాంకులో విలీనమయ్యే అవకాశముంది. ఇందుకు వీలుగా ముసాయిదా ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మంగళవారం ప్రకటించింది. వెరసి ఆర్థికంగా పరిపుష్టమైన డీబీఎస్ బ్యాంకు ద్వారా ఎల్‌వీబీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశీయంగా కార్యకలాపాలు విస్తరించిన డీబీఎస్ బ్యాంకు ఇందుకు ఆసక్తిని వ్యక్తం చేయడంతోపాటు.. అవరసమైతే ఎల్‌వీబీని పటిష్టం చేసేందుకు అదనపు నిధులను వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎల్‌వీబీ ఖాతాదారులు, ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
వాటాదారులకు నిల్
సాధారణంగా బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ ఆర్‌బీఐ నిబంధనల కారణంగా ఖాతాదారులకు పెద్దగా సమస్యలు ఎదురుకావని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. అయితే బ్యాంకు షేర్లను కొనుగోలుచేసిన వాటాదారులపై ప్రభావం ఉంటుందని పేర్కొన్నాయి. సాధారణంగా బిజినెస్‌లు వృద్ధిలో ఉన్న సంస్థల షేర్లు లాభపడినట్లే.. నష్టాల బాట పట్టిన కౌంటర్లు పతనమవుతుంటాయని మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఇక లక్ష్మీ విలాస్ బ్యాంకు నెట్‌వర్త్ మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో వాటాదారులకు నష్టం వాటిల్లడం సహజమేనని వివరించారు. సెప్టెంబర్‌కల్లా బ్యాంకు కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) -2.85 శాతానికి చేరగా.. మార్చి నుంచి టైర్-1 క్యాపిటల్ ప్రతికూలంగా నమోదవుతోంది. ప్రస్తుతం -4.85 శాతానికి జారింది. సెప్టంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు రూ. 397 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఈ నేపథ్యంలో షేరు తాజాగా 20 శాతం కుప్పకూలి రూ. 12.5కు చేరింది. ఈ షేరు 2017 జూన్‌లో రూ. 187 స్థాయిలో ట్రేడ్‌కావడం ప్రస్తావించదగ్గ విషయం!
వాటాదారుల జాబితా
లక్ష్మీవిలాస్ బ్యాంకులో ఎన్‌బీఎఫ్‌సీ.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4.99 శాతం వాటాను కలిగి ఉంది. గతంలో ఎల్‌వీబీ విలీనానికి ఐబీ హౌసింగ్ ప్రయత్నించి విఫలమైన విషయం విదితమే. కాగా.. ఎల్‌వీబీలో శ్రేఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌కు 3.44 శాతం, కాప్రి గ్రూప్ హోల్డింగ్స్‌కు 3.82 శాతం వాటా, ఎల్‌ఐసీకి 1.6 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఇదేవిధంగా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు 1.83 శాతం, ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్‌కు 2.73 శాతం చొప్పున వాటా ఉంది. ప్రమోటర్ల వాటా 6.8 శాతానికి పరిమితమైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment